VRO beats Flood Victim in Vijayawada | విజయవాడ: వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడి, వారికి ఉచితంగా సరుకులు పంచింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్స్ సైతం అమర్చారు. విజయవాడను ముంచిన బుడమేరు గండ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిదక చర్యలు చేపట్టి పూడ్చింది. కానీ విజయవాడలో ఓ వీఆర్వో చేసిన పనికి అంతా షాకయ్యారు. తమకు ఆహారం, నీళ్లు రావడం లేదని వరద బాధితుడు ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన వీఆర్వో జయలక్ష్మీ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. వీఆర్వో జయలక్ష్మీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆమెకు షాకాజ్ నోటీసులు జారీ చేశారు.


నన్నే ప్రశ్నిస్తావా అంటూ మహిళా వీఆర్వో వీరంగం


విజయవాడలో వరద బాధితులపై మహిళా వీఆర్వో చెలరేగిపోయింది. తమ వీధిలో మంచినీరు, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి చెంప పగలగొట్టింది జయలక్ష్మీ. అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే చెప్పరాని పదాలు వాడుతూ బాధితుడిని దుర్భాషలాడింది. బాధితుడు తనను ప్రశ్నిస్తుంటే ఫోన్ లో రికార్డ్ చేసి బెదిరింపులకు దిగింది. అయితే వరద సాయం అడిగితే చెయ్యి చేసుకోవడం ఏంటని బాధితుడితో పాటు స్థానికులు జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. తమకు ఆహారం, మంచినీళ్లు లేవని అడిగితే వారికి సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి, ఓ వ్యక్తిపై మహిళా అధికారిణి దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో జయలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు డిమాండ్ చేశారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వరద బాధితుడిపై దురుసుగా వ్యవహరిస్తూ చెయ్యి చేసుకున్నందుకు ఆమెను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



చంద్రబాబు ఆదేశాలను ఉద్యోగులు పాటించరా?


వరద బాధితులకు ప్రభుత్వం, అధికారులు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు. కానీ కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు జరగుతున్నాయి. బాధితులతో సంయమనంగా వ్యవహరించి, వారికి సర్దిచెప్పడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు చంద్రబాబు. వరద బాధితులకు సహాయం చేయడంలోగానీ, వరద పరిస్థితులపైగానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులతో పాటు మంత్రులను సైతం ఇదివరకే చంద్రబాబు  హెచ్చరించారు. కానీ కొందరు ఉద్యోగుల తీరు మారకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.


సీఎం చంద్రబాబు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలైన ఊర్మిళానగర్, భవానీపురం ప్రాంతంలో సోమవారం పర్యటించారు. బాధితులను పరామర్శించడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు. వరద బాధితులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోందని, మంత్రులు, అధికారులు ఇంకా బురదలోనే పనిచేస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.


Also Read: Prakasam Barrage Is Safe: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి, కౌంటర్ వెయిట్స్ ఫిక్స్ చేసిన కన్నయ్యనాయుడు