Heavy Rains In AP And Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర ఉదయం 11:30 గంటలకు తీరం దాటింది. దీని ప్రభావం రాష్ట్రంలో మరో 24 గంటల పాటు ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. వాయుగుండం అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు, తూ.గో, పశ్చిమగోదావరితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే, విశాఖ, తూ.గో జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మల్కాన్‌గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.










సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్


రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరు వరద ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆరా తీశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూ.గో జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయాలని.. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలన్నారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని పేర్కొన్నారు. అటు, విజయవాడలోని కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


తెలంగాణలోనూ..


తెలంగాణలో (Telangana) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాలు - విరిగిపడ్డ కొండ చరియలు, పలు చోట్ల రాకపోకలు బంద్