Landslide In Alluri District: వాయుగుండం ప్రభావంతో ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర సహా అల్లూరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో అల్లూరి జిల్లా (Alluri District) జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అటు, అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో.. నర్సీపట్నం - భద్రాచలం రహదారిపై కొండచరియలు కింద పడ్డాయి. సీలేరు - ధారకొండ మధ్య దాదాపు 12 చోట్ల చరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. సుమారు 16 కి.మీ మేర పలుచోట్ల కొండ చరియలు విరిగి పడడంతో ఆ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి.
మరిన్ని ఘటనలు
అటు, అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపిలేని వర్షాలతో సీలేరు జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో డొంకరాయి, ఫోర్ బే డ్యామ్‌ల 15 గేట్లు ఎత్తి 1,10,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు వరదతో శబరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వై.రామవరం మండలంలోని చామగడ్డ పంచాయితీ పనసలపాలెం - పలకలజీడి కల్వర్టు పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అటు, తూ.గో జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండి పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలువకు వరద పోటెత్తింది. దీంతో మూడు చోట్ల గండ్లు పడి గ్రామాన్ని వరద ముంచెత్తింది. మరోవైపు, భారీ వానలతో కొల్లేరుకు భారీగా వరద చేరింది. ఏలూరు - కైకలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. దీంతో పెద్దఎడ్లగాడి వద్ద పోలీసులు వాహనాలు నిలిపివేశారు. కొల్లేరు ముంపు గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, విశాఖ జిల్లాలోని గోపాలపట్నంలో కొన్ని ఇళ్లు ప్రమాదం అంచున ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే గణబాబు ఈ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను పునరావాస కేంద్రానికి తరలించారు.
ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతంలో నిరంతరం వర్షాలు కురుస్తున్నందున.. బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సేఫ్ ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.