Paralympics Closing Ceremony Highlights, Paris 2024: పారా అథ్లెట్ల అద్బుత ప్రదర్శనలు... పతక సంబరాలు... స్ఫూర్తివంత పోరాటాలతో సాగిన పారిస్ పారాలింపిక్స్(Paris 2024 Paralympics) ముగిశాయి. పారా అథ్లెట్ల సంకల్ప బలాన్ని మరోసారి విశ్వ క్రీడలు ప్రపంచానికి చాటి చెప్పాయి. ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఈ పారిస్ పారా ఒలింపిక్స్ ముగియడంతో.. ఇక లాస్ ఏంజెల్స్‌లో జరిగే విశ్వ క్రీడలపై ఆసక్తి పెరిగింది.
ఘనంగా ముగింపు వేడుకలు..
పారిస్ పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు జరిగినట్లే ముగింపు వేడుకలు కూడా అదిరిపోయేలా జరిగాయి. ఫ్రెంచ్ గాయకుడు శాంటా జానీ.. "వివ్రే పోర్ లే మెయిల్లెర్" పాట పాడడంతో ముగింపు సంబరాలు ఆరంభమయ్యాయి. తర్వాత ఫ్రాన్స్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పారాలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాలు అక్షర క్రమంలో పరేడ్ నిర్వహించాయి. భారత్ నుంచి హర్విందర్ సింగ్, ప్రీతి పాల్ పతాకధారులుగా వ్యవహరించారు. ఆర్చరీలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించగా... అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా ప్రీతిపాల్ చరిత్ర సృష్టించింది. ఈ పరేడ్ ముగిసిన తర్వాత పారాలింపిక్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ టోనీ ఎస్టాంగ్యూట్... వేదికపై నుంచి ప్రసంగించారు. తర్వాతా పారిస్ పారాలింపిక్స్ విజయవంతం కావడానికి సహకరించిన 2,000 మందికి పైగా వాలంటీర్లను సత్కరించారు.
ఇక తదుపరి పారాలింపిక్స్‌కు..
పరేడ్ ముగిసిన తర్వాత ఫ్రాన్స్ ఆర్మీ అధికారులు పారాలింపిక్ జెండాను అవనతం చేశారు. పారిస్ మేయర్ అన్నే హిడాల్గో ఒలింపిక్ జెండాను వచ్చే ఒలింపిక్స్ జరగనున్న లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్‌కు అందజేశారు. గ్రామీ అవార్డు గెలుచుకున్న రాపర్, గాయకుడు అండర్సన్ కూడా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనల్లో కొందరు ఆటగాళ్లు కూడా పాల్గొని సందడి చేశారు. లేసర్ షో అబ్బుర పరిచింది. ఇర్ఫాన్, నథాలీ డుచెన్, అలాన్ బ్రాక్స్, DJ ఫాల్కన్, కవిన్స్‌కీ, కిడ్డీ స్మైల్, కిట్టిన్, అనెతా, ఒఫెన్‌బాచ్, ది ఎవెనర్ ప్రత్యేక ప్రదర్శనలతో అదరగొట్టారు.
టాప్‌లో చైనా
ఈ పారాలింపిక్స్‌లో చైనా(Chaina) పతాకల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 94 స్వర్ణాలు, 74 రజతాలు, 49 కాంస్యాలతో మొత్తం 217 పతకాలు సాధించి డ్రాగన్ పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో నిలిచింది. 47 పసిడి పతకాలు సహా 120 పతకాలు సాధించి గ్రేట్ బ్రిటన్(Uk) రెండో స్థానంలో.. 36 స్వర్ణాలు సహా మొత్తం 103 పతకాలు సాధించిన అమెరికా(USA )మూడో స్థానంలో నిలిచాయి. భారత్ 18 వస్థానంలో నిలిచింది. పారిస్‌లో టార్గెట్ 25ను విజయవంతంగా దాటేసిన భారత పారా అథ్లెట్లు... ఇక 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే పారాలింపిక్స్‌లో టాప్-10 నిలవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.