Monkeypox in India: దేశంలోనే తొలి మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఆయన్ను ఐసోలేషన్ లో ఉంచామని ప్రకటనలో పేర్కొంది. అతనికి పరీక్షలు నిర్వహించగా.. మంకీ పాక్స్ వైరస్ పాజిటివ్ అని తేలిందని వెల్లడించింది. అయితే, అతని ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని వెల్లడించింది.


‘‘ఇది ఒక ఐసోలేటెడ్ కేసు. జూలై 2022 నుంచి ఇప్పటిదాకా నమోదైన 30 కేసుల మాదిరిగానే ఉంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన క్లాడ్ 1 ఎంపాస్స్ కు చెందిన ప్రస్తుత పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదు. Mpox ట్రాన్స్‌మిషన్‌ ఉన్న ఒక దేశం నుంచి బాధితుడైన యువకుడు ఇండియాకు వచ్చాడు. ఇతణ్ని ప్రస్తుతం నిర్దేశిత ఐసోలేషన్ లో సింగిల్ గా ఉంచాం’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


తాజాగా గుర్తించిన మంకీపాక్స్ కేసులో మంకీపాక్స్ స్ట్రెయిన్ వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 గా నిర్ధారించారు. కానీ ఇది డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీలో చేర్చిన స్ట్రెయిన్ క్లాడ్ 1 కాదు. 2022 నుంచి క్లాడ్ 2కి సంబంధించి 30 కేసులు కనుగొన్నారు.


ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంకీపాక్స్ కు సంబంధించి ఒక సలహాను జారీ చేశారు. అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. మంకీపాక్స్ నివారణకు అన్ని రాష్ట్రాలు ఆరోగ్యపరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మంకీపాక్స్‌కు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాలని కోరారు. మంకీపాక్స్‌పై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) జారీ చేసిన సీడీ-అలర్ట్ (కమ్యూనికబుల్ డిసీజ్ అలర్ట్)పై చర్య తీసుకోవాలని సూచించారు.


ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి పరిస్థితి బాగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చింతించాల్సిన పనిలేదు. ప్రోటోకాల్ ప్రకారం, వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేయడం జరిగింది. అతను విదేశాల్లో ప్రయాణించిన ట్రావెల్ హిస్టరీ కూడా సేకరించారు. ఆగస్టు 20న పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు దేశంలోని అన్ని పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో భారత్ హెచ్చరికలు జారీ చేసింది.


మంకీపాక్స్‌కు సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. WHO నివేదిక ప్రకారం, మంకీపాక్స్ ఆఫ్రికన్ దేశం కాంగో నుంచి ఉద్భవించింది. ఆఫ్రికాలోని 10 దేశాలు దీని బారిన పడ్డాయి. ఆ తర్వాత పొరుగు దేశాలకు వేగంగా వ్యాపించింది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.


కరోనా మాదిరిగానే, ఇది విమాన ప్రయాణం, ఇతర ప్రయాణ మార్గాల ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విస్తరిస్తోంది. WHO కూడా దీనిపై ఆందోళన చెందుతోంది. ఎందుకంటే మంకీపాక్స్ వ్యాప్తిలో మరణాల రేటు మారుతూ ఉంటుంది. చాలాసార్లు ఇది 10 శాతం కంటే ఎక్కువగా ఉంది.


లక్షణాలు ఇవే..


ఈ వైరస్‌తో ఇన్ఫెక్షన్ చాలా దుష్ప్రభావాలను కలిగి ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. దీని కారణంగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై చీము నిండిన బొబ్బలు ఏర్పడతాయి. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ జాతి కుటుంబానికి చెందినది. ఇది మశూచికి కూడా కారణమవుతుంది.