Sandalwood Policy 2022:
కర్ణాటకలో కొత్త పాలసీ..
కర్ణాటక ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌కు చెక్ పెట్టనుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. కొత్త విధానంతో (Sandalwood Policy-2022)లో భాగంగా...రైతులు తమ భూమిలో ఎర్రచందనం సాగు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అంతే కాదు. వాటిని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకూ అవకాశం కల్పించనుంది. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో కర్ణాటక ఆరోగ్యమంత్రి కె. సుధాకర్ కీలక విషయాలు వెల్లడించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎర్ర చందనానికి డిమాండ్ పెరుగుతోందని, అందుకే...ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. రైతులు తమ పంట భూముల్లోనే గంధపు చెక్క సాగు చేస్తే...వారి ఆదాయం పెరగడంతో పాటు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమూ ఉండదని అన్నారు. ఈ కొత్త విధానంతో గంధపు చెక్క సాగు, రవాణా, మార్కెటింగ్ సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఎర్రచందనం సాగు చేయాలనుకునే రైతులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ శాఖ అధికారులను సంప్రదించి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారో, అంత మొతాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తరవాత ఎర్రచందనం మొక్కలకు ప్రభుత్వం GPS ఇన్‌స్టాల్ చేస్తుంది. స్మగ్లింగ్‌ను నిలువరించేందుకు ఈ జీపీఎస్‌ను వినియోగించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వాటిని రవాణా చేసి విక్రయించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకూ నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. రైతులు తమ పంటపొలాల్లో గంధపు చెక్కను సాగు చేయటం నేరంగా పరిగణించేవారు. కానీ...ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా అనుమతి నివ్వడం వల్ల స్మగ్లింగ్‌కు తెర పడే అవకాశముంది.
స్మగ్లింగ్‌కు చెక్..
అంతకు ముందు ఎవరైనా సరే...అటవీ శాఖ డిపోట్‌లోనే ఎర్రచందనాన్ని విక్రయించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను పక్కన పెట్టి...ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు అనుమతనిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఎర్ర చందనానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని ఔషధాలు, సౌందర్యసాధనాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. వీటి వేర్లు కూడా ఏదో విధంగా ఉపయోగపడతాయి. అందుకే..
అంతర్జాతీయ మార్కెట్‌లోని ఫుల్ డిమాండ్ ఉంటుంది. కాకపోతే..భారత్‌లో వీటి ఉత్పత్తి తక్కువ. ఆ డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్ చేసుకోటానికి కొందరు అక్రమ మార్గంలో వాటిని సాగు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కర్ణాటకలోని Karnataka Soap and Detergent Limited Company గంధపు చెక్కతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడ ఆ చెక్క దొరకడం లేదు. ఫలితంగా...వేరే చోట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో...ఈ ఇబ్బందులు తొలగనున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే గంధపు చెక్కను ఇకపై స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. జీపీఎస్ సాయంతో...మొక్కలను ట్రాక్ చేసే వెసులుబాటు ఉంటుందని..ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినా..సులువుగా పసిగట్టొచ్చని తేల్చి చెప్పింది.