Indira Gandhi 105th birth anniversary:
ఇండియా అంటే ఇందిరా..
భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 105వ జయంతి సందర్భంగా దేశమంతా ఆమెను స్మరించుకుంటోంది. 1917 నవంబర్ 19న అలహాబాద్‌లో కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు ఇందిరా గాంధీ. 1984 అక్టోబర్ 31వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1966లో భారత దేశానికి మూడో ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఓ మహిళ ప్రధాని కావడం అదే తొలిసారి. అయితే..ప్రధానిగా ఎన్నికైన కొన్నాళ్ల వరకు ఆమెకు ఎన్నో విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల చేతుల్లో "కీలుబొమ్మ"గా మారిపోయారన్న అసహనమూ పెరిగింది. కానీ...క్రమంగా తనను తాను మార్చుకున్నారు ఇందిరా గాంధీ. ప్రధానిగా ఓ టర్మ్ పూర్తి చేసుకున్నాక ఆమెలో చాలా మార్పు వచ్చింది. సీనియర్ నేతల చేతుల్లో కీలుబొమ్మ అన్న వాళ్లే "ఇండియా అంటే ఇందిరా" అని కీర్తించే స్థాయికి ఎదిగారు. పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగడం, బంగ్లాదేశ్ ఉద్యమ సమయంలో ఆ దేశానికి మద్దతుగా నిలవడం
లాంటివి ఆమెకు పేరు తెచ్చి పెట్టాయి. 1970 ల నాటికి భారతదేశ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు ఇందిరా. భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా...తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నెహ్రూ తరవాత భారత్‌కు అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది ఇందిరా గాంధీయే. 1966 నుంచి 1977 వరకూ..మళ్లీ 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్‌లో ఆమె తుది శ్వాస విడిచే వరకూ ప్రధానిగా కొనసాగారు.
ఒంటరి బాల్యం..
1947 నుంచి 1964 వరకూ తన తండ్రికి ప్రత్యేక సలహాదారుగా పని చేశారు ఇందిరా గాంధీ. విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషించారు. 1959లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవినీ చేపట్టారు. 1964లో నెహ్రూ మరణించిన తరవాత...రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి లాల్‌బహదూర్ శాస్త్రి క్యాబినెట్‌లో సమాచార ప్రసారశాఖ మంత్రిగానూ పని చేశారు. 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణించాక...ప్రధాని బాధ్యతలు తీసుకున్నారు. ఇందిరా గాంధీ బాల్యమంతా ఒంటరిగానే గడిచిపోయింది. ఆమె తండ్రి అయిన నెహ్రూ...ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండేవారు. తల్లి అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల ఒంటరిగా ఫీల్ అయ్యేవారు ఇందిరా. ఆ తరవాత తన తల్లి మరణించారు. అప్పటి నుంచి తండ్రికి లేఖలు రాస్తూ క్షేమ సమాచారం తెలుసుకునే వాళ్లు. నేరుగా మాట్లాడుకుంది మాత్రం తక్కువే. మహాత్మా గాంధీకి అభిమాని అయిన ఇందిరా గాంధీ...స్వాతంత్య్రోద్యమంలో గాంధీ వెంటే నడిచారు. ఖాదీ ధరించి స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. గరీబీ హటావో అనే నినాదాన్ని భారత దేశానికి పరిచయం చేసింది ఇందిరా గాంధీయే. 1971లో ఆమె తీసుకొచ్చిన ఈ నినాదం..ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
ప్రధాని మోడీ నివాళి..
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ వేదికగా స్పందించారు. "ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు" అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన...ఇందిరా గాంధీ పటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.