ఫార్ములా ఇ రేస్‌ నిర్వహణలో గందరగోళం నెలకొంది. సమన్వయలోపం కారణంగా వందల మంది రోడ్‌పైనే ఉండిపోవాల్సి వచ్చింది. నిర్వాహకులు, పోలీసులు, బుక్‌మైషో మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆన్‌లైన్ టికెట్లను అనుమతించ లేదు. దీంతో కాసేపు ఏం జరుగుతోందో తెనియని పరిస్థితి ఏర్పడింది. 


ఆన్‌లైన్ కాపీలు చూపించిన వారిని పోలీసులు అనుమతించకపోవడంతో... స్టాండ్‌2లో ప్రేక్షకులు బారులు తీరారు. స్కానర్ ఏర్పాటు చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు కూడా వారికి సరైన సమాచారం ఇవ్వలేదు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు హార్డ్ కాపీలు ఉంటేనే అనుమతి ఇస్తామంటూ ప్రకటించారు. పోలీసుల ప్రకటనతో వచ్చిన సందర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. 


ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ సిద్ధమైంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో భాగంగా హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌.. మోటార్‌స్పోర్ట్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సమాయత్తమైంది.  హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందడి చేయనుంది. 


ఆరు జట్లు.. 24 మంది డ్రైవర్లు పాల్గొనే రేసింగ్‌ లీగ్‌ నాలుగు రౌండ్ల పాటు సాగుతుంది. ఇవాళ రేపు మొదటి రౌండ్‌, డిసెంబరు 10, 11 తేదీల్లో నాలుగో రౌండ్‌ రేసులకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది. ఈనెల 25-27, డిసెంబరు 2-4 వరకు వరుసగా రెండు, మూడో రౌండ్‌ రేసులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆరు జట్లలో నలుగురు చొప్పున డ్రైవర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్‌ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొట్టమొదటి ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో తాజా సర్క్యూట్‌ ట్రయల్‌ రన్‌లా పనిచేయనుంది.


ఇండియన్ రేసింగ్ లీగ్ అంటే..






మోటార్‌స్పోర్ట్స్‌లో ఫార్ములావన్‌ అత్యున్నత రేసు. చాలామంది డ్రైవర్లు నేరుగా ఫార్ములావన్‌ రేసులో పాల్గొనలేరు. అక్కడికి చేరుకునేందుకు ఎఫ్‌4తో మొదలుపెట్టి.. ఎఫ్‌3లో బరిలో దిగి.. ఎఫ్‌2 స్థాయికి చేరుకుంటారు. ఆ తర్వాతే ఫార్ములా వన్‌లో బరిలో దిగే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఫార్ములా రేసుల్లో పాల్గొనడం అందరికీ సాధ్యం కాదు. అందుకే భారత్‌లో ఉన్న ప్రతిభావంతుల కోసంఐఆర్ ఎల్ (ఇండియన్ రేసింగ్ లీగ్) ఏర్పాటు చేశారు.  అమెరికాలో ఇండికార్‌, జపాన్‌లో సూపర్‌ ఫార్ములా మాదిరిగా మనకంటూ ఇది సొంత రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌. ఆరు జట్లలో స్వదేశీ, విదేశీ డ్రైవర్లు ఉంటారు. ప్రస్తుత సీజన్‌లో 24లో 12 మంది అంతర్జాతీయ రేసింగ్‌ డ్రైవర్లు కాగా.. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు.