ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కటౌట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కటౌట్ సగానికిపైగా కాలిపోయింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనకు కారకులు ఎవరు అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.


అర్దరాత్రి కలకలం....
కృష్ణాజిల్లా మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా 
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కటౌట్ ను స్దానిక వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్‌ను శుక్రవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పారిపోయారు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బందరు డీఎస్పీ భాష, పెడన రూరల్ సీ.ఐ. ప్రసన్న గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 


జగన్ కటౌట్‌కు అర్ధరాత్రి నిప్పు పెట్టడంతో మంటు ఎగసిపడ్డాయి. వెంటనే స్థానికులు మంటలు పెద్దవి కాకుండా నిలువరించారు. ఎవరు ఘటనకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


రంగంలోకి వైసీపీ....


సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు పెట్టటంపై స్దానిక వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎం.పీ.పీ 
 మధుసూదన్ రావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కామేశ్వరరావు, గూడూరు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎన్.ఏ.సలీం, దళిత నాయకులు సంఘటనా స్థలం వద్ద కొద్ది సేపు ఆందోళన నిర్వహించారు. నెల రోజులు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెడనలో పర్యటించారు. చేయూత పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహయాన్ని అందించారు. అప్పుడు స్థానిక వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కటౌట్ ఏర్పాటు చేశారు. 


ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ ఫ్లెక్సీలపై కటౌట్‌లకు నిప్పు పెట్టటం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దమ్ముంటే కటౌట్‌ను తగలపెట్టిన వారు బహిరంగ చర్చకు రావాలని గూడూరు ఎంపీపీ సంఘం నేతలు మధుసూదన్ రావు, కారుమంచి కామేశ్వరావు సవాల్ విసిరారు.


నిన్న వైసీపీ,జనసేన బాహాబాహీ...


మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా స్థానికంగా జనసేన నాయకులు పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి జోగి రమేష్ అనుచరుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ముందే జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్రపోషించారని జనసేన ఆరోపిస్తోంది. జిల్లా ఎస్పీ స్పందించి‌ చర్యలు తీసుకోవాలని జనసేన నేత‌ యడ్లపల్లి రామ్ సుధీర్ కోరారు. తమ వారిని ఎందుకు అరెస్టు చేశారని అడిగినందుకు రామ్‌సుధీర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో జనసేన, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ఇచ్చిన హామీలు అమలు‌ చేయాలని పోస్టర్లు అంటించామని జనసేన నేతలు వెల్లడించారు. దీంతో జనసేన నేతలరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జనసేన నేతలపై మంత్రి జోగి రమేష్ అనుచరులు పోలీస్టేషన్‌లోకి వెళ్లి దాడికి పాల్పడటం కలకలం రేపింది.