Same Sex Marriage:


స్పెషల్ కమిటీ..


స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం తన వాదన వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు ప్రస్తావించింది. స్వలింగ వివాహం చేసుకున్న వాళ్లు సొసైటీలో ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించింది. కొన్ని ఉదాహరణలూ చెప్పింది. రోజువారీ లైఫ్‌లో వచ్చే సమస్యలతో పాటు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చా లేదా..? ఇన్సూరెన్స్ పాలసీలో ఆ వ్యక్తిని నామినీగా పెట్టొచ్చా లేదా అన్న అంశాలనూ తెరపైకి తీసుకొచ్చింది. ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయన్న అంశంపైనా ఈ కమిటీ దృష్టి సారించనుంది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు కోర్టుకి వెల్లడించారు. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ కమిటీ కేంద్రం అభిప్రాయాలేంటో చెప్పాలని అడిగింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని పక్కన పెడితే అలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు వర్తిస్తాయా లేదా చెప్పాలని కేంద్రాన్ని అడిగింది ధర్మాసనం. అయితే...కేంద్రం మాత్రం స్వలింగ వివాహాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇది చట్టపరిధిలోని అంశం అని...సుప్రీంకోర్టు కలగజేసుకోకపోవడమే మంచిదని చెప్పింది. 






రాష్ట్రాలకు లేఖలు..


ఈ అంశంపై అభిప్రాయాలేంటో చెప్పాలని ఇప్పటికే కేంద్రం...అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను ఖండిస్తున్న కేంద్రం...ప్రొసీడింగ్స్‌లో రాష్ట్రాలనూ చేర్చాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే...సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అందుకే వెంటనే కేంద్రం అలెర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలేంటో తెలుసుకుని పూర్తి స్థాయి నివేదికను కోర్టులో సమర్పించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్రం. ఈ విచారణలో రాష్ట్రాల అభిప్రాయాలూ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే అంశం రాష్ట్రాల చట్ట పరిధిలోనూ ఉంటుందని, అందుకే ప్రొసీడింగ్స్‌లో వాళ్లనూ చేర్చడం మంచిదని వివరిస్తోంది. దీనిపై ఓ "ఉమ్మడి అభిప్రాయం" ఏంటో తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది. అప్పటి వరకూ విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది. కానీ కోర్టు మాత్రం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 


Also Read: Hit-And-Run Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు, 3 కి.మీ. వరకూ కార్‌ రూఫ్‌పైనే బాధితుడు - తీవ్ర గాయాలతో మృతి