Geoffrey Hinton on AI:  ప్రపంచాన్ని నడిపిస్తున్న మానవ మేధకు అతి త్వరలోనే పెను సవాల్ ఎదురు కాబోతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే రాబోయే కాలంలో మానవ మేధస్సుపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉందని కృత్రిమ మేధ సృష్టించిన శాస్త్రవేత్త, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా ప్రసిద్ధి చెందిన జాఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ నుంచి భవిష్యత్తులో ఎదురు కానున్న ప్రమాదాల గురించి మానవ జాతిని హెచ్చరించేందుకు వారం క్రితమే ఆయన గూగుల్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2015లో టొరంటోలో తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఏఐని సృష్టించారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఏఐ విషయంలో గూగుల్ సంస్థ ఎంతో జవాబుదారీతనంలతో వ్యవహరిస్తుందని ప్రశంసించిన హింటన్.. ఈ టెక్నాలజీ వల్ల తలెత్తబోయే దుష్ప్రభావాల గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు తాను గూగుల్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.


ఏఐ త్వరలో అసాధారణంగా అభివృద్ధి చెందుతుందని, దాని వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయని హింటన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతానికి మనిషికంటే ఏఐ తెలివైందేమీ కాదని.. కాకపోతే త్వరలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ కోట్లాది ఉద్యోగాలను లేకుండా చేస్తుందని చెప్పుకొచ్చారు. అది సృష్టించే మాయా ప్రపంచంలో నిజమేదో తెలుసుకోవడం కూడా చాలా కష్టం అని పేర్కొన్నారు. 


ఏఐ అభివృద్ధి చెందితే ఉద్యోగాలు ఊడడం అనుమానం కాదు, పచ్చి నిజం


కృత్రిమ మేథ విస్తృతంగా అభివృద్ధి చెందితే, మనుషుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని, ఉద్యోగాలు ఊడతాయన్న అనుమానాలు ఇకపై అనుమానాలు కావు, పచ్చి నిజాలు. ప్రపంచ స్థాయి టెక్‌ దిగ్గజ సంస్థ ఒకటి, తన కంపెనీలో కొత్త ఉద్యోగ నియామాకాలను నిలిపేస్తోంది, పాత ఉద్యోగుల స్థానాన్ని కృత్రిమ మేథతో భర్తీ చేయబోతోంది. ఆ కంపెనీ పేరు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్‌ కార్పొరేషన్‌. రాబోయే సంవత్సరాల్లో 7,800 ఉద్యోగాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో భర్తీ చేయడానికి ప్లాన్‌ వేసింది. 


వచ్చే ఐదేళ్లలో 30% ఉద్యోగాలు హుష్‌ కాకి


కంపెనీ బ్యాక్ ఆఫీస్ వర్క్‌లో రిక్రూట్‌మెంట్ తగ్గిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే నియామకాలను నిలిపేశామన్నారు. "ఐదేళ్ల వ్యవధిలో 30% ఉద్యోగాలు AI & ఆటోమేషన్ ద్వారా సులభంగా భర్తీ అవుతాయి" అని కృష్ణ వెల్లడించారు. దీంతో, దాదాపు 7,800 మంది మనుషులు ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దాదాపు 26,000 మంది సిబ్బంది నాన్-కస్టమర్ ఫేసింగ్‌ విభాగాల్లో ఉన్నారని, మానవ వనరులు (HR) వంటి బ్యాక్ ఆఫీస్ ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని కృష్ణ చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రకటించిన అతి పెద్ద వర్క్‌ఫోర్స్‌ స్ట్రాటెజీల్లో IBM ప్రణాళిక ఒకటి. కస్టమర్ సేవలను స్వయంచాలకం (ఆటోమేషన్‌) చేయడం, టెక్ట్స్‌ రాయడం, కోడ్‌ను జెనరేట్‌ చేయడం వంటి ఎన్నో ఊహలకు AI టూల్స్‌ సామర్థ్యం తలుపులు తెరిచింది. అయితే.. ఉద్యోగాల భర్తీలో చిచ్చు పెట్టే AI సామర్థ్యంపై చాలా మంది ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.