Russia-Ukraine War: 



సౌదీ అరేబియాలో భేటీ..


జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ ఎప్పుడూ చొరవ చూపిస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధం ఆగిపోవడం కన్నా భారత్‌కి సంతోషాన్నిచ్చే విషయం ఇంకేదీ ఉండదని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఏదో విధంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు అజిత్ దోవల్. అందుకే...అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అక్కడ శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. UN చార్టర్‌, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని తేల్చి చెప్పారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో కీలక భేటీకి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత మార్గాలపై ఈ సమావేశంలోనే చర్చలు జరిగాయి. 


"ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యని పరిష్కరించేందుకు భారత్ ఎప్పుడూ ముందుకొస్తుంది. ఈ సమస్య పరిష్కారమవడం కన్నా ఆనందం భారత్‌కి మరింకేదీ ఉండదు"


- అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు






రెండ్రోజుల భేటీ


సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిల్ సల్మాన్ నేతృత్వంలో రెండ్రోజుల పాటు సమావేశాలకు పిలుపునిచ్చారు. ఈ భేటీకి దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా అధికారులు వచ్చారు. అయితే...ఈ సమావేశానికి రష్యాకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అమెరికా భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ కూడా హాజరయ్యారు. భారత్ తరపున అజిత్ దోవల్ వెళ్లారు. ఆ సయమంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రస్తావన రాగా...మొదటి నుంచి ఈ సైనిక చర్యను భారత్ గమనిస్తోందని దోవల్ స్పష్టం చేశారు. 


"ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అందరూ సహకరించాలి. భారత్ తరపున ఈ సమావేశానికి హాజరు కావడం వెనక ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. భారత్ తరపున ఉక్రెయిన్‌కి అందాల్సిన సాయం అందుతోంది. మానవతా దృక్పథంతో సహకారం అందిస్తున్నాం. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. భారత్ విధానం ఇదే"


- అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు 


రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం...తమ దేశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నాకే ఈ చర్చలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. అంటే...రష్యా సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగితే కానీ అందుకు ఒప్పుకోనని పరోక్షంగా చెప్పారు. క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సాన్‌ ప్రాంతాలు ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ అధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే రష్యా సైనిక చర్య మొదలు పెట్టిందో అప్పటి నుంచి అవి రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఇది సాధించిన తరవాతే చర్చలకు వెళ్తామని అంటున్నారు జెలెన్‌స్కీ.


Also Read: హరియాణాలో ఇంకా తగ్గని అలజడి, నూహ్‌లో మరో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్ బంద్