Haryana Clashes:


ఆగస్టు 8 వరకూ నో ఇంటర్నెట్ 


హరియాణాలో అల్లర్లు జరిగినప్పటి నుంచి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నూహ్ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు గట్టిగానే ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8వ తేదీ వరకూ ఇంటర్నెట్ సర్వీస్‌లను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌పై ఆంక్షలుండగా..ఇప్పుడు ఆ తేదీని పొడిగించింది. బల్క్‌ SMSలనూ నిషేధించింది. హరియాణా హోంశాఖ సెక్రటరీ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. డాంగిల్ సర్వీస్‌లు కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వ్యక్తిగత SMSలు, వాయిస్ కాల్స్, మొబైల్ రీఛార్జ్, బ్యాంకింగ్ ఎస్‌ఎమ్‌ఎస్ సర్వీస్‌లపై ఎలాంటి ఆంక్షలు లేవు. వారం రోజుల క్రితం నూహ్ ప్రాంతంలో హిందు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో భయాందోళనలు మొదలయ్యాయి. వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 216 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 104 కేసులు నమోదు చేశారు. 


ప్రతిపక్షాల డిమాండ్..


దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే...రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇది ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కాదని, ఇలాంటి అల్లర్లు జరుగుతాయన్న ముందస్తు సమాచారం తమకు రాలేదని తేల్చిచెప్పారు. ఈ అలజడి మధ్యే నూహ్‌లో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది ప్రభుత్వం. హిందువులపై ముస్లింలు ఓ హోటల్ నుంచి రాళ్లు విసిరారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడా హోటల్‌ని పూర్తిగా కూలగొట్టారు అధికారులు. అది అక్రమ నిర్మాణమని తేల్చి చెప్పారు. దాదాపు 12 చోట్ల అక్రమ నిర్మాణాలాన్ని కూల్చేశారు. దాదాపు 50-60 అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేసినట్టు సమాచారం. దాదాపు మూడు రోజులుగా పలు చోట్ల బుల్‌డోజర్లతో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వీటిని కూల్చకుండా ఇలాగే వదిలేశారు. 


ముస్లింలు ఇంతగా దాడులు చేయడానికి కారణం...విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన యాత్ర. ఆ యాత్రను లీడ్ చేసిన మోను మనేసర్...గతంలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి అక్కడ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించాడు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం...వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2,500 మంది ఆందోళనకారులు ఆలయంపై దాడి చేశారు. అక్కడి షాప్‌లను ధ్వంసం చేశారు. పోలీసులు చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి ఆందోళనల తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఒకేసారి 700 మంది పోలీసులను పంపింది. అయితే..వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల కొంత మంది పారిపోయి వచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరో కీలక విషయం ఏంటంటే..మేవట్ ఎస్‌పీ సెలవులో ఉన్నప్పుడే ఇది జరగడం. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


Also Read: జ్ఞానవాపి మసీదులో ఆలయ ఆనవాళ్లు! విగ్రహం త్రిశూలం కనిపించాయంటున్న హిందువులు