Viral Video: 


ఇండిగో ఫ్లైట్‌లో ఘటన..


ఇండిగో ఫ్లైట్‌లో AC పని చేయక ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉన్నట్టుండి AC సిస్టమ్‌ ఆగిపోయింది. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా అదే ఫ్లైట్‌లో ఉన్నారు. "ఇంత కన్నా దారుణమైన అనుభవం ఇంకేం ఉండదు" అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియో కూడా పోస్ట్ చేశారు. దాదాపు గంటన్నర పాటు అలా ఉక్కపోతలోనే గడిపినట్టు చెప్పారు. ఛండీగఢ్‌ నుంచి జైపూర్‌కి వెళ్లే విమానంలో ఈ సమస్య తలెత్తింది. ACలు ఆగిపోగానే దాదాపు పావు గంట పాటు ఫ్లైట్‌ అలానే ఎయిర్‌పోర్ట్‌లో ఆగిపోయింది. ఆ తరవాత ACని బాగు చేయకుండానే టేకాఫ్ చేశారు. దాదాపు గంటన్నర పాటు నరకం చూశారు ప్రయాణికులు. మళ్లీ ల్యాండ్ అయ్యే వరకూ అవస్థలు పడ్డారు. చెమటలు పోసి అంతా గొడవ చేస్తుంటే ఎయిర్‌హోస్ట్‌లు వచ్చి టిష్యూ పేపర్‌లు ఇచ్చారు. ఇది ప్రయాణికులను ఇంకా అసహనానికి గురి చేసింది. చేసేదేమీ లేక ఆ టిష్యూ పేపర్‌లనే విసురుకున్నారు. ఈ ఘటనపై అమరీందర్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టడమే కాకుండా ఆ పోస్ట్‌కి DGCAని ట్యాగ్‌ చేశారు. 


"ఛండీగఢ్‌-జైపూర్ ఇండిగో ఫ్లైట్‌లో అత్యంత దారుణమైన అనుభవం ఎదురైంది. దాదాపు 90 నిముషాల పాటు ఉక్కపోతతో చచ్చిపోయాం. టేకాఫ్‌ అయినప్పటి నుంచి ల్యాండింగ్ అయ్యేంత వరకూ ఇదే పరిస్థితి. గంటన్నర పాటు ప్రయాణికులంతా అవస్థలు పడ్డారు. సిబ్బంది ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. అంతా చెమటలు పోసి ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎయిర్‌హోస్ట్‌లు వచ్చి టిష్యూ పేపర్‌లు ఇచ్చారు"


- అమరీందర్ సింగ్ రాజా, పంజాబ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్






ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఫ్లైట్‌లలో ఒకే రోజు ఇలాంటి ఇబ్బందికరమైన ఘటనలు జరిగాయి. ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్‌ పట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇంజిన్‌ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన మూడు నిముషాలకే ఈ సమస్య తలెత్తింది. మరో ఘటనలో...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. 


లైంగిక వేధింపులు..


ఇండిగో ఫ్లైట్‌లో (Indigo Airlines) మహిళా ప్యాసింజర్‌ని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. తనను లైంగికంగా వేధించినట్టు 24 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా నిందితుడు ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషయల్ కస్టడీకి తరలించారు. ఆ తరవాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...శ్రీవాస్తవ, బాధితురాలి సీట్‌లు పక్కపక్కనే ఉన్నాయి. జులై 26న ఢిల్లీ నుంచి ఉదయం 5.30 గంటలకు ఇండిగో ఫ్లైట్ ముంబయికి బయల్దేరింది. మరి కాసేపట్లో ముంబయిలో ల్యాండ్ అవుతుందనగా...పక్కనే ఉన్న మహిళను అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. ఇది సహించలేక బాధితురాలు వాగ్వాదానికి దిగింది. సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ముంబయిలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరినీ సహార్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లింది ఇండిగో సిబ్బంది. తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు...నిందితుడిపై FIR నమోదు చేశారు. 


Also Read: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భారీ భూకంపం - ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌లోనూ కంపించిన భూమి