Earthquake In Delhi : ఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో శ‌నివారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. అఫ్గాన్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. తాజాగా సంభవించిన భూకంప కేంద్రాన్ని తజకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉందని తెలిపారు.


ఆఫ్ఘ‌నిస్థాన్‌తోపాటు పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో, ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్​లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ ప్రాంతాల్లో పలుమార్లు భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పలుమార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల ప్రజలు భూప్రకంపనలకు భయపడి ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూమి కంపించినట్లు ఢిల్లీ, నోయిడా వాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఏమైనా నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అర్ధరాత్రి భూకంపం వస్తే పరిస్థితి ఏంటని ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.






ఇటీవల అండమాన్ దీవుల్లో భూకంపం.. 
బుధవారం తెల్లవారు జామున అండమాన్ నికోబార్ దీవులను భూకంపం వణికించింది. ఉదయం 5 :30 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టార్‌ స్కేలు పై 5.0 గా నమోదు అయ్యింది. ఇది భూమి లోపల 10 కిలో మీటర్ల లోతులో సంభవించడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు.






అండమాన్‌ దీవుల్లో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రళయానికి ఇది సంకేతమో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. ఇంతకు ముందు జులై 29న అర్ధరాత్రి 12.53 గంటలకు ఈ అండమాన్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఎన్సీఎస్ తెలిపింది. ఏదైనా ముంపు వచ్చి పడితే ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.