Rajamundry Car Accident: తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి తీవ్ర విషాదం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ట్రిప్ కి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి మునిగిపోవడంతో ఊపిరాడక ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలో స్నేహితులు విహారయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణం కాగా ప్రమాదానికి గురయ్యారు. కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద శనివారం (ఆగస్టు 5) అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాద ఈ ఘటన జరిగింది. ఈ ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. 


అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతానికి మొత్తం 10 మంది స్నేహితులు కలిసి వెళ్లారు. రెండు కార్లలో వీరంతా వెళ్లగా, ఓ కారును డ్రైవర్ నడుపుతున్నాడు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలోకి వారి కార్లు వచ్చే సరికి విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకొని పోయింది. స్థానికంగా ఉన్న పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అందులోనే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను ఉదయ్‌ కిరణ్‌, హర్ష వర్ధన్‌, హేమంత్‌గా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాల్వలో పడిన కారును క్రేన్ల సాయంతో బయటికి తీయించారు.