PM Modi: తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్ధశ పట్టనుంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం అమృత్ భారత్ పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 39 స్టేషన్లను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నారు. మొదటి విడత కింద 21 స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్ల అభివృద్ధికి మొత్తం రూ. 894 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు ఆగస్టు 6వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 24.45 కోట్లతో జనగామ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలు కల్పించడం లాంటి పనులు చేపడతారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లలో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఉచితి వైఫై వంటి సదుపాయాలు కల్పిస్తారు.
స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ షాపులు, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు, స్టేషన్ ముందు, వెనకా మొక్కల పెంపకం, చిన్న చిన్న గార్డెన్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. అవసరమైన నిర్మాణాలు చేపడతారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సుస్థిర-పర్యావరణ అనుకూల పరిష్కారాలతో పనులు చేపట్టడం, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ ఫుట్ పాత్ లు, రూఫ్ ప్లాజాలు కూడా నిర్మిస్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దేందుకు రూ.715 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
మొదటి విడతలో ఎంపికైన 21 స్టేషన్లు ఇవే
నాంపల్లి - రూ.309 కోట్లు, మలక్ పేట్ - రూ. 27.6 కోట్లు, మేడ్చల్ - రూ.27.6 కోట్లు, ఉప్పుగూడ - రూ.26.8 కోట్లు, హఫీజ్ పేట - రూ. 26.6 కోట్లు, హైటెక్ సిటీ రూ.26.6 కోట్లు, నిజామాబాద్ - రూ.53.3 కోట్లు, కరీంనగర్ - రూ. 26.6 కోట్లు, కామారెడ్డి - రూ.39.9 కోట్లు, మహబూబ్ నగర్ - రూ.39.9 కోట్లు, మహబూబాబాద్ - రూ. 39.7 కోట్లు, రామగుండం(పెద్దపల్లి) - రూ.26.5 కోట్లు, ఖమ్మం - రూ.25.4 కోట్లు, మధిర (ఖమ్మం) - రూ.25.4 కోట్లు, జనగామ - రూ. 24.5 కోట్లు, యాదాద్రి - రూ.24.5 కోట్లు, కాజీపేట జంక్షన్ - రూ. 24.5 కోట్లు, తాండూర్ (వికారాబాద్) - రూ. 24.4 కోట్లు, భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) - రూ. 24.4 కోట్లు, జహీరాబాద్ (సంగారెడ్డి) - రూ.24.4 కోట్లు, ఆదిలాబాద్ - రూ. 17.8 కోట్లు ఖర్చు చేయనున్నారు.