Russia-Ukraine War:


విద్యుత్ నెట్‌వర్క్‌ లక్ష్యంగా..


ఉక్రెయిన్‌లోని విద్యుత్ గ్రిడ్‌లను ధ్వంసం చేసింది రష్యా. ఫలితంగా..ఉక్రెయిన్‌ పౌరులు చీకట్లోనే బతకాల్సి వస్తోంది. దేశంలోని విద్యుత్‌ నెట్‌వర్క్‌ని రష్యా నాశనం చేస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా కారణంగా...లక్షలాది మంది పౌరులు అంధకారంలో మగ్గిపోతున్నారని మండి పడ్డారు. "ప్రస్తుతం కోటి మందికి పైగా ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు. ఒడెస్సా, విన్నిత్సియా, సుమీ, కీవ్ ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది" అని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. నిజానికి..
రష్యా మొదట ఉక్రెయిన్‌లోని భవంతులు, ఇళ్లపై దాడులు చేసింది. ఉక్రెయిన్ సైన్యం దీటుగా పోరాడుతుండటం వల్ల...ఆ దేశాన్ని దెబ్బ తీసేందుకు పవర్‌ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లుతున్నప్పటికీ...ఉక్రెయిన్‌పై దాడులను మాత్రం ఆపటం లేదు. విల్‌నిస్క్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్‌లోని గ్యాస్ ప్రొడక్షన్ ప్లాంట్‌తో పాటు డ్నిప్రోలోని మిసైల్ ఫ్యాక్టరీలనూ లక్ష్యంగా చేసుకుంది రష్యా. 


పోలాండ్‌లోనూ క్షిపణి దాడులు..


రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పొరుగు దేశాలు కూడా టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా..పోలాండ్‌లోనూ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ పౌరులు అంతా పోలాండ్‌కు వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు అండగా ఉంటామని పోలాండ్ కూడా గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనతో రష్యా తీవ్రంగా మండి పడింది. అప్పటి నుంచి పోలాండ్‌ను కూడా టార్గెట్‌ చేసుకుంది. నేరుగా తలపడక పోయినా...అక్కడ అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తోంది. నాటో సభ్య దేశమైన పోలాండ్‌పై రష్యా మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో పోలాండ్ ఆర్మీ అప్రమత్తమైంది. కానీ...రష్యా మాత్రం ఈ దాడి తాము చేయలేదని ఖండిస్తోంది. పోలాండ్ మీడియా కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మండి పడింది. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాలిలో G-7,NATO ఆత్యయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..రష్యాపై ఆరోపణలు చేశారు. యుద్ధ వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకే రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.


ఈ దాడులతో తమకు సంబంధం లేదని రష్యా చెబుతున్నా..జెలెన్‌స్కీ మాత్రం రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాటో దేశాలు రష్యాపై కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. రష్యా ఉగ్రవాదం కేవలం తమ దేశానికే పరిమితం కావడం లేదని, మిగతా దేశాల్లోనూ అలజడి రేపుతోందని ఆరోపించారు. నాటో దేశమైన పోలాండ్‌పై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు, జెలెన్‌స్కీ...పోలాండ్ అధ్యక్షుడు ఆండ్ర్‌జెజ్ దుడతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వైరం ఉంది. ఇలాంటి ఘటనలు.. పరిస్థితులు అదుపు తప్పుతాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.


Also Read: Jeff Bezos Advice: పెద్ద పెద్ద టీవీలు కార్‌లు కొనకండి, అమెరికన్లకు బెజోస్ ఉచిత సలహా - మిస్‌ఫైర్ అయిన కామెంట్స్