NZ vs IND 1st T20: భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 సిరీసులో మొదటి మ్యాచ్‌ రద్దైంది. వెల్లింగ్టన్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో కనీసం టాస్‌, బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు.ఈ రెండు దేశాల మధ్య మిత్రభావం, ఆటగాళ్ల మధ్య సహృద్భావం ఉండటంతో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. ఆట చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో స్టేడియానికి వచ్చారు. చివరికి నిరాశగా ఇంటి ముఖం పట్టారు.






ఉదయం నుంచి వెల్లింగ్టన్‌లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రౌన్‌, వేన్‌ నైట్స్‌ ఔట్‌ ఫీల్డ్‌ను తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. ఒకవేళ వాన ఆగిపోతే మ్యాచ్‌ ఆరంభానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొనేందుకు వచ్చారు. వారి ఆశలు అడియాసలే అయ్యాయి. అసలు వరుణుడు కరుణించనేలేదు. గత్యంతరం లేకపోవడంతో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:52 గంటలకు మ్యాచ్‌ రద్దు చేసినట్టు ప్రకటించారు. ఐదు ఓవర్ల మ్యాచ్‌ కటాఫ్ టైమ్‌నకు 54 నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.






వర్షం కురవడంతో రెండు జట్ల ఆటగాళ్లు ఇండోర్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. ఫుట్‌వాలీ, ఇతర క్రీడలు ఆడారు. యుజ్వేంద్ర చాహల్‌, సంజూ శాంసన్‌, ఇష్ సోధీ ఒకవైపు ఉండగా మరోవైపు టిమ్‌ సౌథీ ఇతర ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌ సరదాగా గడిపారు. మ్యాచ్‌ రద్దయ్యాక రెండు జట్ల కెప్టెన్లు హార్దిక్‌ పాండ్య, కేన్‌ విలియమ్సన్‌ హ్యాండ్ షేక్‌ ఇచ్చుకున్నారు.