IND vs NZ 1st T20: భారత్‌, న్యూజిలాండ్ తొలి టీ20 టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి వెల్లింగ్టన్‌లో వరుణుడు దోబూచులాడుతున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు జల్లులు ఎక్కువయ్యాయి. దాంతో టాస్‌ ఆలస్యమైంది. వాన చినుకులు మరీ ఎక్కువ పడకపోయినా మ్యాచ్‌ సాగేందుకు పరిస్థితి అనకూలంగా లేదు. అభిమానులు మాత్రం ఆట జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. స్టేడియంలో చాలామంది భారతీయులు కనిపిస్తున్నారు.






గిల్ థ్రిల్!


వర్షం కురుస్తుండటంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు న్యూజిలాండ్‌లో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'అండర్‌ 19 ప్రపంచకప్‌ ఆడేందుకు తొలిసారి ఇక్కడ అడుగుపెట్టాను. 2019లో వన్డేల్లో ఇక్కడే అరంగేట్రం చేశాను. న్యూజిలాండ్‌లో నాకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్ని టెక్నిక్స్‌పై దృష్టి పెట్టాను. వాటిని అమలు చేయాల్సి ఉంది. సిక్సర్లు కొట్టేందుకు పవర్‌ను కాకుండా టైమింగే ముఖ్యమని నా నమ్మకం. బ్యాటును స్వింగ్‌ చేయడం కన్నా బంతి కోసం ఎదురు చూడటం ముఖ్యం' అని శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు.


ఆ రెండింట్లోనే!


ప్రైవేట్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఈ పర్యటన హక్కులను దక్కించుకోలేదు. స్టార్‌స్పోర్ట్స్‌, సోనీ ఛానళ్లలో ఈ మ్యాచులు ప్రసారం కావు. దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో (Doordarshan Sports) మాత్రమే లైవ్‌ టెలికాస్ట్‌ చూసేందుకు వీలుంది.  తొలి టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime) అందుబాటులో ఉంది. తొలిసారిగా ప్రైమ్‌ ఈ హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను ప్రకటించింది.


భారత్, న్యూజిలాండ్‌ టీ20, వన్డే సిరీసుల షెడ్యూలు


తొలి టీ20 - నవంబర్‌ 18, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక వెల్లింగ్టన్‌
రెండో టీ20 - నవంబర్‌ 20, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక మౌంట్‌ మాంగనూయ్‌
మూడో టీ20 - నవంబర్‌ 22, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక నేపియర్‌
తొలి వన్డే - నవంబర్‌ 25, ఉదయం 7 గంటలకు, వేదిక ఆక్లాండ్‌
రెండో వన్డే - నవంబర్‌ 27, ఉదయం 7 గంటలకు, వేదిక హ్యామిల్టన్‌
మూడో వన్డే - నవంబర్‌ 30, ఉదయం 7 గంటలకు, వేదిక క్రైస్ట్‌ చర్చ్‌