Russia Ukraine Conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించడంపై జీ7 దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోందని మండిపడ్డాయి. పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై కూడా జీ7 దేశాలు తీవ్రంగా స్పందించాయి.
వర్చువల్ భేటీ
ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమంపై చర్చించేందుకు జీ7 దేశాధినేతలు వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ చర్యలకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 హెచ్చరించింది.
మరోవైపు రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ సామర్ధ్యాలను కల్పించాలని జీ7 దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్ధించారు. మాస్కోపై కఠినమైన ఆంక్షలు విధించాలని జీ7 సమావేశంలో జెలెన్‌స్కీ కోరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ అన్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా మిసైల్స్ ప్రయోగించిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి BNO న్యూస్‌కు తెలిపారు.
కీవ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. భారీ శబ్దంతో కీవ్‌లో పేలుళ్లు సంభవించినట్లు AP న్యూస్ తెలిపింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోలో కూడా పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.
నగరమంతటా క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. రష్యా ఎంతలా దాడి చేసిన వాటిని తిప్పికొడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాకు తలవొంచే ప్రసక్తే లేదన్నారు.
Also Read: IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!
Also Read: Viral Video: పానీపూరీ ఎలా ఉంది గజేంద్ర! ఎంచక్కా లాగించేసింది!