Munugodu Byelection Campaign: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సీరియస్ గా సాగుతోంది. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను పంపి ప్రజల్ని తాగుబోతుల్ని చేస్తున్న ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ‘‘మంత్రులూ.. మీరు తాగితే తాగండి ప్రజల్ని మాత్రం చెడగొట్టకండి’’ అంటూ మాట్లాడారు. పథకాలకు రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం లిక్కర్ ద్వారా రూ.45 వేల కోట్లు తీసుకెళ్తోందని ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని తూఫ్రాన్ పేటలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘కళ్యాణలక్ష్మీ, పెన్షన్, రైతుబంధు పథకాలకు 22 వేల కోట్లు, సంక్షేమ హాస్టళ్లలాంటివి అన్నీ కలిపి 25 వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రతి వందమందికి ఒక బెల్ట్ షాప్ పెట్టి తాగిపించి 45 వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఇస్తున్న సీఎంకు కౌలు రైతులకు అదే ఆర్థిక సాయం ఇవ్వడానికి మనసు రావడం లేదు. దళితబంధు ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఇస్తావా? పేదలకు ఇవ్వు తప్ప అధికారులకు కాదు. గిరిజనబంధు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల గిరిజన ఓట్ల కోసం వచ్చింది తప్ప వాళ్ళ మీద ప్రేమ కోసం కాదు.
నా భార్య జమున కేసీఆర్ ఒక నమ్మక ద్రోహి అని అని బహిరంగంగా చెప్పింది. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చిన. ఇప్పుడు నా ఆస్తులు తెగనమ్ముత. కేసీఆర్ మీద కొట్లాట మాత్రం అపవద్దు అని నాకు భరోసా ఇచ్చింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజల్ని అభ్యర్థించింది. జమున ఈ నియోజకవర్గం మట్టి బిడ్డ. రాజగోపాల్ రెడ్డి కష్టం చూసి ఆమె అమ్మ గారి ఊరు పలివెలకు వచ్చి ధర్మాన్ని కాపాడమని కోరింది.
ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఒక ఎమ్మెల్సీ ఆమెకు ఇక్కడేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటడట.. ఇక్కడ పుట్టిన బిడ్డ ఆమె సొంత ఊరికి రావొద్దట. ఎక్కడో ఉన్న వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడట. ఆయన చేసేది ఏంది? యువకులకు తాగిపించడం. అరే కబర్ధార్ మా జోలికి వస్తే మాడి మసి అవుతారు. ఎన్నికల కమిషన్, పోలీసులను కోరుతున్నా. స్వేచ్ఛగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలి. లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
కేసీఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదు. 2023 వరకే ఆయన ఉంటారు. అధికారులేం ఆయన బానిసలు కాదు. కేసీఆర్ బానిసల్లాగ పని చేసే అధికారులు, పోలీసులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీ భరతం పట్టడం ఖాయం. ఎవరి జోలికి పోకుండా మేము ప్రచారం చేసుకుంటున్నాం. మా జోలికి రావద్దు. మీకు ధర్మం న్యాయం లేదు డబ్బును మద్యాన్ని నమ్ముకున్నారు పిచ్చి వేషాలు వేస్తే హుజూరాబాద్ లో జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుంది.
మోడీ గీడి ఎవరు వెంట్రుక కూడా పీకలేరు అని ఒకాయన మాట్లాడుతున్నారు. ఆయన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మీ మాటలు అన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లనే మీకు డబ్బులు వస్తున్నాయి. మీ ముంగిటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఆయన వల్లే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన్ని మర్చిపోవద్దు’’ అని మునుగోడు ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.