రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది సహా ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను మొదలుపెట్టింది. మూడు రోజుల పాటు ఎయిర్ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశం తీసుకురానుంది.
ఫిబ్రవరి 22, 24, 26న మూడు విమానాలను భారత్- ఉక్రెయిన్ మధ్య ఆపరేట్ చేయనున్నట్లు ఎయిర్ఇండియా ఇప్పటికే ప్రకటించింది. వీటికి అదనంగా మరో నాలుగు విమానాలు ఫిబ్రవరి 25, 27, మార్చి 6న ఉక్రెయిన్ రాజధాని క్వియ్ నుంచి భారత్ బయల్దేరనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు ఎయిర్ అరేబియా, ఎయిర్ దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్ ఉక్రెయిన్-భారత్ మధ్య సాధారణ విమాన సేవలను కొనసాగిస్తాయని పేర్కొంది.
రష్యా దూకుడు
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇకనుంచి డొనెట్స్క్, లుహాన్స్క్ రెండింటిని స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామన్నారు. ఈ ప్రాంతాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని తెలిపారు.
భారత్ శాంతిమంత్రం
రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడిన భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడారు. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని కోరారు.
Also Read: Palindrome Date Today: నేటి తేదీ ప్రత్యేకతేంటో తెలుసా? ఎలా చదివినా ఒకలాగే ఉంటుంది