దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ ఆకట్టుకుంది. మొత్తం 12 రాష్ట్రాలు, 9 ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాశీ విశ్వనాథుని ఆలయ సౌందర్యాన్ని, సాంస్కృతిక సౌరభాన్ని వివరించేలా ఈ శకటాన్ని తయారుచేశారు.






శకటం విశేషాలు..



  • ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.

  • నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా సాధించిన విజయాలను చాటిచెప్పేలా ఈ శకటాన్ని రూపొందించారు. 

  • ప్రపంచ ప్రఖ్యాతమైన కాశీ విశ్వనాథ్ నడవా నమూనాను కూడా ఈ శకటంలో భాగం చేశారు.

  • శకటం ముందు భాగంలో సంప్రదాయ వస్తువులు, శిల్పాల తయారీ, హస్తకళల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సాధించిన ప్రగతికి దర్పణం పట్టేలా నమూనాలను తీర్చిదిద్దారు.

  • శకటం మధ్య భాగంలో సాధువులు, మునులు.. వారణాసిలోని వివిధ ఘాట్‌లలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నట్లు చూపించారు. ఇది మన సంప్రదాయంలో భాగమనే విషయాన్ని తెలియజేశారు.

  • కాశీ విశ్వనాథుని ఆలయం సహా నగర ప్రాసస్త్యాన్ని తెలియజేసేలా రూపకల్పన చేశారు.


మరిన్ని శకటాలు..


ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటంతో పాటు పంజాబ్ శకటం కూడా ఆకట్టుకుంది. భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్య్ర పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు.


మేఘాలయ రాష్ట్రానికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్లుగా ఉన్న నమూనా ప్రత్యేకంగా ఉంది. గుజరాత్ శకటంపై అక్కడి గిరిజనుల పోరాట పటిమ తెలిసేలా నమూనాలు ఉన్నాయి. గోవా శకటాన్ని అక్కడి వారసత్వ చరిత్రను చాటి చెప్పేలా తయారు చేశారు.


Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..


Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..