Rahul Gandhi on NDA:
కేంద్రం వద్ద సమాధానాలుండవు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భాజపాపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కాస్త ఫన్నీగా సెటైర్లు వేస్తుంటారు. జీఎస్‌టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలిచే ఆయన...ఈ సారి NDAకి కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏని No Data Available(NDA)గా అభివర్ణించారు. ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీ ఇలా విమర్శలు చేశారు. "దేశంలో ఎవరూ ఆక్సిజన్ కొరతతో చనిపోలేదు. నిరసనలు చేస్తూ ఏ రైతూ ప్రాణాలు కోల్పోలేదు. వలస కార్మికులెవరూ నడుస్తూ నడుస్తూ మృతి చెందలేదు. ఏ జర్నలిస్ట్‌నూ అరెస్ట్ చేయలేదు. ఇవేవీ జరగలేదని కేంద్రం మనల్ని నమ్మించాలని చూస్తోంది. డేటా ఉండదు. సమాధానాలుండవు" అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సమావేశాలు పదేపదే వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. నిత్యావసర సరుకులపై జీఎస్‌టీ విధించటంపై రాహుల్ గాంధీ ప్రశ్నించగా..కేంద్రం సరిగా సమాధానం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. నిత్యావసరాలపై జీఎస్‌టీ విధించటం సహా, ధరలు పెరగటంపై ప్రశ్నలు అడుగుతున్నా కేంద్రం వివరణ ఇవ్వటం లేదని విమర్శిస్తున్నాయి.
జీఎస్‌టీపై చర్చ జరగాల్సిందే..
ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంట్ సమావేశాలు వరుసగా నాలుగు రోజుల పాటు వాయిదా పడ్డాయి. సమావేశాల కోసం లోక్‌సభ, రాజ్యసభ సిద్ధమైన కొద్ది క్షణాల్లోనే రెండు సభలూ వాయిదా పడ్డాయి. అయితే ప్రతిపక్షాలు ఈ అంశంపై స్పందించాయి. సభలు వాయిదా వేయటం తమ ఉద్దేశం కాదని, కానీ మొట్టమొదట నిత్యావసర ధరల పెరుగుదల, జీఎస్‌టీ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. "ఆహార పదార్థాలపై జీఎస్‌టీని ఎందుకు పెంచారో కేంద్రం తప్పకుండా వివరణ ఇవ్వాల్సిందే" అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.
Also Read: Children Health : కోవిడ్, మంకీపాక్స్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో ! వర్షాకాలంలో పిల్లలను కాపాడుకోండి ఇలా