Children Health :  ప్రస్తుతం వర్షాకాలం. ఓ వైపు మంకీపాక్స్, కరోనా గడగడలాడిస్తున్నాయి. అదే సమయంలో సీజనల్ వ్యాధులూ విజృంభించే సమయం.  దోమలు వ్యాప్తి వర్షాల సమయంలో అధికంగా ఉంటుంది. వీటికారణంగా పిల్లలకు డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా,న్యుమోనియా వంటి వ్యాధులు తలెత్తుతాయి. జ్వరం, వాంతు, విరేచనాలు, కడుపునొప్పి వంటి నుంచి పిల్లలను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో పిల్లలకు ఎలాంటి వైరస్‌లు.. రోగాల నుంచి ముప్పు ఉంది..? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?


మంకీపాక్స్ 


మంకీపాక్స్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ అయిన వైరస్. మన దేశంలోనూ వెలుగు చూసింది. పిల్లలకూ ఈ వైరస్ సోకుతోందని తాజాగా తేలింది. అమెరికాలో ఇద్దరు పిల్లలకు వైరస్ సోకినట్లుగా గుర్తించారు. కరోనా లాగానే ఈ వైరస్ కూడా సులువుగా ఒకరి నుంచి వ్యాపిస్తుది. ఆఫ్రికాలో ఈ వైరస్ కామన్‌గా మారిపోయింది. మన దేశంలో పూర్తి స్తాయిలో ఇది ప్రమాదకరమైన వైరస్‌గానే భావిస్తున్నారు. అందుకే కోవిడ్ తరహా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


డెంగీ 


మన దేశంలో వైరస్‌ల తర్వాత పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది డెంగీ జ్వరం ద్వారానే. వర్షాకాలంలో ఈ జ్వరాలు పిల్లపై దాడి చేస్తాయి. ఈ జ్వరం వస్తే ప్లేట్ లెట్స్ పడిపోవజం వంటి ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దేశంలో అత్యధికంగా  డెంగీ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అందుకే ఇంట్లో దోమలు ఎక్కడా ఉండకుండా జాగ్రత్లు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కరోనా తరహా జాగ్రత్తలుతీసుకుని.. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. 


స్వైన్ ఫ్లూ 


ప్రతి వర్షాకాలంలో ప్రజలపై దాడి చేసేది స్వైన్ ఫ్లూ. ఇటీవలికాలంలో పిల్లలు ఎక్కువగా ఈ స్వైన్ ఫ్లూ కు గురవుతున్నారు. దీని వల్ల తీవ్రమైన స్వాస ఇబ్బందులు వస్తాయి. కరోనాలాగే స్వైన్ ఫ్లూను నిర్లక్ష్యం చేయలేరు. లక్షణాలు కనిపించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


టొమాటో ఫీవర్ 


ఈ పేరు కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా.. ప్రమాదకమైన జ్వరాలలో ఒకటి.  ఈ జ్వరం డెంగీ లేదా చికన్‌గున్యా తరహాకు చెందిదా లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్సా (ఆర్‌ఎస్‌వీ) లేక అడినో వైరస్సా లేదా రైనోవైరసా అనే అంశం మీద నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. కానీ పిల్లలకు సోకితే మాత్రం ప్రమాదకరం. నిజానికి దీనికీ టొమాటోలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది సాధారణ ప్రజలూ గుర్తుపెట్టుకోడానికి వీలుగా పెట్టిన పేరు మాత్రమే. ఇది టొమాటోల వల్ల ఎంతమాత్రమూ రాదు. కాబట్టి ఇది సోకినవారు, ఇతరులూ టొమాటోలను  నిరభ్యంతరంగా తినవచ్చు.


పిల్లలకు జాగ్రత్తలు నేర్పాలి !


వర్షకాలంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించటం ద్వారా తల్లిదండ్రులు, తమ పిల్లలను ఆనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఈ కాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేలా వారికి మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలి. పాలు , పండ్లు,గుడ్లు, నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేయాలి.  ఇంట్లో దోమలు నివాసం ఏర్పరుచుకోకుండా చెత్త చెదారాన్ని ఏప్పటికప్పుడు తొలగించాలి. ఆహార పదార్ధాలు ఎక్కవ సమయం నిల్వ ఉన్నవి కాకుండా వేడివేడిగా,తాజా అందించాలి.చిన్నచిన్న జబ్బులే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలను పాటిస్తూ వారికి వైద్యం అందించాలి. స్కూలుకు వెళుతున్న చిన్నారులు మాస్కులు తప్పనిసరిగా ధరించటం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం వంటి వాటిపై అవగాహన కలిగించటం మంచిది.