Rahul Gandhi Defamation Case: 


పిటిషన్ కొట్టివేత..


రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి "న్యాయ పోరాటం" చేస్తానంటూ గట్టిగానే చెబుతూ వచ్చారు. పైకోర్టులో తేల్చుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా పలు సందర్భాల్లో తేల్చి చెప్పింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌కి కోర్టు షాకిచ్చింది. ఈ పిటిషన్‌ కొట్టేసింది. విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై స్టే విధించాలని రాహుల్ పిటిషన్ వేయగా...దాన్ని తిరస్కరించింది. దీంతో ఆయనపై అనర్హతా వేటు కొనసాగనుంది. 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఇప్పటికే అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ మేరకు ఖాళీ చేశారు రాహుల్. గత వారమే ఈ పిటిషన్‌పై తీర్పు చెప్పాల్సి ఉన్నప్పటికీ...ఇవాళ్టికి (ఏప్రిల్ 20) వాయిదా వేసింది సెషన్స్ కోర్టు. ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అంతకు ముందు రాహుల్ గాంధీ కోర్టుపై ఆరోపణలు చేశారు. ట్రయల్ కోర్టు తనతో చాలా దురుసుగా ప్రవర్తించిందని విమర్శించారు. ఏప్రిల్ 3వ తేదీన సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్ తరపున న్యాయవాదులు రెండు పిటిషన్‌లు వేశారు. జైలు శిక్షపై స్టే విధించేందుకు ఓ పిటిషన్, అప్పీల్ చేసుకునేంత వరకూ శిక్షపై విధించాలని మరో పిటిషన్ వేశారు. రాహుల్‌కి బెయిల్ ఇచ్చే క్రమంలోనే పూర్ణేష్ మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ నోటీసులు పంపింది కోర్టు. 






ఫైజల్‌ కేసు..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. రాహుల్ లాగానే...తన ఎంపీ  పదవిని కోల్పోయిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ మళ్లీ ఆ పదవిని సంపాదించుకున్నారు. న్యాయ పోరాటం చేసి అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ లీగల్ టీమ్...ఇదే కేసుని ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా లోక్‌సభ సభ్యత్వాన్ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. రాహుల్ న్యాయ పోరాటం చేసేందుకు 30 రోజుల గడువునిచ్చింది సూరత్ కోర్టు. ఈ లోగా ఏదోటి తేల్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇంత కీలక సమయంలో ఫైజల్ సభ్యత్వం రీస్టోర్ అవడం ఆసక్తికరంగా మారింది. 


ఇదీ అసలు వివాదం..


ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...రాహుల్‌కు శిక్ష విధించింది.  అయితే వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. రాహుల్ ప్రధాని మోదీని దారుణంగా అవమానించారని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వర్గాన్ని కించపరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌పై ఐపీసీ సెక్షన్స్ 499,500 ప్రకారం పరువు నష్టం కేసు నమోదైంది. 2021 అక్టోబర్‌లో రాహుల్ సూరత్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. పూర్తి విచారణ తరవాత ఆయనను దోషింగా తేల్చింది సూరత్ కోర్టు. 


Also Read: Per Capita Income: పేరు గొప్ప-ఊరు దిబ్బ, తలసరి ఆదాయంలో ఆంగోలా కన్నా ఘోరం మనం