India Per Capita Income: భారతదేశం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది దేశ ఆకాంక్ష. ఆశలు చూస్తే ఆకాశంలో - పనులు చూస్తే పాతాళంలో అన్నట్లుగా ఉంది మన దేశ పరిస్థితి. దేశ ప్రజల తలసరి ఆదాయం పరంగా, ప్రపంచంలోని పేద దేశాల విభాగంలోకి భారతదేశం వస్తుంది. ప్రజలకు కనీస అవసరాలు కూడా అందక, అనునిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే అంగోలా వంటి పేద దేశం కంటే భారతదేశ తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నది ఒక చేదు నిజం. 


ప్రజల తలసరి ఆదాయంలో, ప్రపంచంలోని 197 దేశాలలో భారతదేశం 142వ స్థానంలో ఉంది.


అమెరికా తలసరి ఆదాయం 31 రెట్లు ఎక్కువ
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అన్ని దేశాల కంటే భారతీయుల తలసరి ఆదాయం ‍‌(India Per Capita Income) అత్యల్పంగా ఉంది. అమెరికా తలసరి ఆదాయం సంవత్సరానికి 80,035 డాలర్లు కాగా, భారతదేశ తలసరి ఆదాయం కేవలం 2,601 డాలర్లు మాత్రమే. అంటే అమెరికా సగటు తలసరి ఆదాయం భారత్ కంటే 31 రెట్లు ఎక్కువ. జర్మనీ, కెనడా తలసరి ఆదాయం భారతదేశం కంటే 20 రెట్లు ఎక్కువ, UK 18 రెట్లు ఎక్కువ, ఫ్రాన్స్ తలసరి ఆదాయం భారతదేశం కంటే 17 రెట్లు ఎక్కువ. జపాన్, ఇటలీల సగటు తలసరి ఆదాయాలు మన కంటే 14 రెట్లు పెద్దవి. భారత్‌, తనకు అతి పెద్ద ప్రత్యర్థిగా భావించే చైనా పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ కూడా భారత తలసరి ఆదాయం కంటే 5 రెట్లు ఎక్కువ. బ్రెజిల్ కూడా మనకంటే చాలా ముందుంది, మన కంటే 4 రెట్లు ఎక్కువ.


చిన్న దేశాలు కూడా మెరుగైన స్థితిలో ఉన్నాయి
పైన చెప్పుకున్న లెక్కలు ఆర్థికంగా చాలా బలమైన, సంపన్న దేశాలవి. అయితే... ఆంగోలా, వనాటు, సావో టోమ్ ప్రిన్సిప్ వంటి చిన్న దేశాల తలసరి ఆదాయం కూడా భారతదేశం కంటే ఎక్కువగా ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆంగోలా తలసరి ఆదాయం 3,205 డాలర్లు, వనాటు తలసరి ఆదాయం 3,188 డాలర్లు, సావో టోమ్ ప్రిన్సిప్ తలసరి ఆదాయం 2,696 డాలర్లు, ఐవరీ కోస్ట్ తలసరి ఆదాయం కూడా 2,646 డాలర్లు. ఇవన్నీ భారతదేశం పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌ 2,601 కంటే పై స్థాయిలో ఉన్నాయి.


తలసరి ఆదాయం 8 ఏళ్లలో రెట్టింపు 
NSO ఇటీవలి డేటా ప్రకారం... భారతదేశ తలసరి ఆదాయం 1,72,000 రూపాయలకు పెరిగింది. 2014-15 కంటే, మోదీ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది. 2014-55లో తలసరి ఆదాయం రూ. 86,647 గా ఉంది. అంటే, ఈ కాలంలో వ్యక్తిగత ఆదాయం దాదాపు 100 శాతం పెరిగింది.


దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
ప్రతి భారతీయుడి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. కానీ భారతదేశ తలసరి ఆదాయం, మన దేశంలో పెరుగుతున్న అసమానతను చూచిస్తోంది. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, దేశ సంపదలో 77 శాతం మొత్తం కేవలం 10 శాతం దేశ జనాభా ఆధీనంలో ఉంది. మిగిలిన 23 శాతం సంపద 90 శాతం మందికి వర్తిస్తుంది. దీనిని బట్టి, దేశంలో ఆర్థిక అసమానతల అంతరం ఎంత భారీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆదాయ పన్ను కట్టే వాళ్ల విషయంలోనూ ఇదే బోధపడుతుంది. మన దేశంలో.. ఏడాదికి రూ. 50 లక్షలు మించి సంపాదించే వాళ్ల సంఖ్య ఏటికేడు పెరుగుతుంటే, ఏడాదికి రూ. 10 లక్షల లోపు సంపాదించే వాళ్ల సంఖ్య ఆ స్థాయిలో పెరగడం లేదు.