క్యాన్సర్ ప్రతియేటా వేలాది మరణాలకు కారణమవుతోంది. అన్ని జబ్బుల్లోకి క్యాన్సర్ అతి పెద్ద కిల్లర్ గా మారింది. ఏ క్యాన్సర్ అయినా సరైన సమయంలో గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుంది. కానీ చాలా సందర్భాల్లో సమయం మించిపోవడం వల్లే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అసలు క్యాన్సర్ల లో ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత రెండో స్థానంలో ఉన్న క్యాన్సర్ బవెల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్. ఇది పాలిప్ అని చెప్పుకునే ప్రీక్యాన్సరస్ స్థాయి నుంచి క్యాన్సర్ గా మారుతుంది. అన్ని పాలిప్ లు క్యాన్సర్ గా మారకపోవచ్చు. కానీ అవి ఏర్పడితే మాత్రం వెంటనె తొలగించడం అవసరం. ఏటా వేల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
చాలా మంది పూర్తిస్థాయిలో లక్షణాలు కనిపిస్తే కానీ రోగనిర్ధారణ గురించి ఆలోచించడం లేదు. పేగులో ఏర్పడే క్యాన్సర్ ను ఫోర్త్ స్టేజ్ లో గుర్తించిన పది మందిలో ఒకరు కంటే తక్కువ మందే పూర్తి చికిత్స చేయించుకొని బతికి బయట పడుతున్నారు. అదే మొదటి దశలో చికిత్స ప్రారంభించిన పది మందిలో తొమ్మిది మంది కంటే ఎక్కువ మందే పూర్తిగా క్యాన్సర్ ను జయిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పది సంవత్సరాల పాటు జీవిత కాలాన్ని పొడగించుకున్న వారు కూడా ఉన్నారు.
చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం. త్వరగా చికిత్స ప్రారంభించడం ఒక్కటే క్యాన్సర్ నుంచి రక్షించుకోగలిగే సాధనాలు.
ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి?
- మలద్వారం నుంచి రక్తస్రావం లేదా మల విసర్జనలో మార్పులు
- సాధారణ టాయిలెట్ అలవాట్లలో మార్పులు అంటే తరచుగా వెళ్లాల్సి రావడం, లేదా మలబద్దకం
- కడుపులో నొప్పి లేదా ఏదైనా లంప్ మాదిరిగా ఉన్నట్టు అనిపించడం
- విపరీతమైన అలసట
- అకారణంగా బరువుతగ్గిపోవడం
పేగుల్లో ఏర్పడిన కణితులు సాధారణంగా రక్త స్రావం అవుతుంటుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా అలసట, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని సార్లు పేవుల్లో క్యాన్సర్ అడ్డుపడుతుంది. దీనిని బవెల్ అబ్సస్ట్రక్షన్ అంటారు.
స్క్రీనింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లకు చాలా విరివిగా స్క్రీనింగ్ జరుగుతోంది. పేగు క్యాన్సర్లకు కూడా స్క్రీనింగ్ పరీక్షల వేగం పెంచాలి. 50 సంవత్సరాలు పైబడిన అందరూ ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో పేద్ద పేగు క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు, లేదా క్యాన్సర్ కానీ పాలిప్ లు కణితులు ఏర్పడిన వారు రక్తసంబంధీకుల్లో ఉన్నవారు కూడా తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు తరచుగా చేయించుకోవాలి. ఈ పరీక్షను ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అంటారు.
పేగు క్యాన్సర్ కు చికిత్స ఉందా?
ఈ క్యాన్సర్ ను త్వరగా గుర్తిస్తే పూర్తిస్థాయిలో చికిత్స అందించడం సాధ్యమే. నిర్థారణ చేసే సమయానికే ఎంత కాలంగా వారు ఈ వ్యాధి బారిన పడి ఉన్నారనే దాని మీద ఆధారపడి వారి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది. 1970ల నుంచి ఇప్పటి వరకు పేగు క్యాన్సర్ తో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని వెంటనే గుర్తిస్తే చికిత్స సాధ్యమే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.