వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సం స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే చర్మానికి హాని కలిగించే UV కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఈ ఎండకి మరింత జిడ్డుగా మారుతుందని, చర్మం కూడా నల్లగా అయిపోతుందని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఒక్కోసారి అవి చర్మ క్యాన్సర్ కి కారణం కావచ్చు. వీటి నుంచి బయట పడాలంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.


వృద్ధాప్య సంకేతాలు నివారిస్తుంది


చర్మానికి ఎటువంటి రక్షణ లేకపోతే సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాల వల్ల ఎలాస్టిన్, కొల్లాజెన్, చర్మ కణాలకు హాని కలుగుతుంది. చర్మం రంగు మారడం. గీతలు, ముడతలు పడటం, చర్మం వదులుగా మారడం వంటి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు తీసుకోకపోతే 30 ఏళ్ల వయసులోనే ముసలి వాళ్ళలాగా కనిపించేస్తారు. కానీ సన్ స్క్రీన్ లోషన్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలు నివారించవచ్చు.


చర్మం మంటను తగ్గిస్తుంది


UV రేడియేషన్ కి గురైనప్పుడు బాహ్య చర్మం ఎర్రగా మారి వాపు కనిపిస్తుంది. చర్మానికి హాని కలిగించే UV కిరణాలు నేరుగా గురికావడం వల్ల తామర, రోసెమియా వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది. సం బ్లాక్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల హానికరమైన కిరణాల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ వంటి సున్నితమైన రసాయనాలు కలిగి ఉన్న సన్ స్క్రీన్ ని ఉపయోగించాలి.


చర్మ క్యాన్సర్ అవకాశాలు తగ్గిస్తుంది


వాతావరణంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్ స్క్రీన్ ధరించడం చర్మ క్యాన్సర్ ని నివారించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. 70 సంవత్సరాల వయసులో చర్మ క్యాన్సర్ సర్వసాధారణంగా మారుతుందని గణాంకాలు చూపిస్తున్నాయి. SPF 30 ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్షణ మరింత అవసరం అనే ఉద్దేశంతో SPF 30 కంటే ఎక్కువ ఉన్న వాటిని ఉపయోగించకూడదు. కనీసం 2 లేదా 3 గంటలకు ఒకసారి అయినా లోషన్ అప్లై చేసుకుంటూ ఉండాలి.


టానింగ్ నివారిస్తుంది


టానింగ్ నుంచి రక్షణగా నిలుస్తుంది. UVB కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. వడదెబ్బ తగిలేలా చేస్తుంది. మీది సున్నితమైన చర్మం అయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలి. వ్యాయామం తర్వాత అప్లై చేయాలి. చెమట వల్ల వచ్చే టాన్ ని తొలగిస్తుంది.


చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది


కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి అవసరమైన చర్మ ప్రోటీన్లు సన్ స్క్రీన్ ద్వారా రక్షించబడతాయి. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రోటీన్లు అవసరం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కడుపు నొప్పి తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే