కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఈ సాగు చట్టాలను ఇంతకుముందే రద్దు చేసి ఉంటే రైతుల ప్రాణాలు నిలిచేవని పలువురు నేతలు అన్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం.
దేశంలోని అన్నదాతలు సత్యాగ్రహం ద్వారా అహంకార ప్రభుత్వం మెడలు వంచారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించిన రైతులకు అభినందనలు. జై హింద్, జై హింద్ కా కిసాన్. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
చట్టాల రద్దుకోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు అభినందనలు. భాజపా ప్రభుత్వం క్రూరత్వాన్ని చూసి రైతులు బెదరలేదు - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
600 మంది రైతులు అమరులయ్యారు. 350 రోజులకుపైగా రైతులు పోరాటం చేశారు. వారిని కర్రలతో కొట్టారు. అరెస్టులు చేశారు. మీ మంత్రి తనయుడు.. రైతులను చంపారు. కానీ మీరు ఏనాడూ లెక్క చేయలేదు. ఇప్పుడు మారుతున్న మీ వైఖరికి ఎన్నికలే కారణమని దేశం మొత్తానికి తెలుసు. - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
నూతన సాగు చట్టాలను రద్దు చూస్తూ ప్రధాని చేసిన ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. ఇది రైతులు చేసిన ఆందోళనకు దక్కిన విజయం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదు. ఈ రోజు రైతులు చరిత్ర సృష్టించారు. - స్టాలిన్, తమిళనాడు సీఎం
ఇది రైతులు సాధించిన గొప్ప విజయం. చరిత్రలో రైతులు ఓ సువర్ణ అధ్యాయం లిఖించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి రైతులు చేసిన పోరాటానికి అభినందనలు. - పినరయి విజయన్, కేరళ సీఎం
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలా ఈరోజు కూడా భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇది కేవలం రైతుల విజయం కాదు యావత్ ప్రజాస్వామ్యం సాధించిన విజయం. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ఎంతగానో ప్రయత్నించింది. రైతులను ఖలిస్థానీలు, తీవ్రవాదులుగా పేర్కొంది. కానీ రైతులు వారి ఉద్యమాన్ని వీడలేదు. - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం
గొప్ప శుభవార్త. గురునానక్ జయంతి పవిత్ర దినోత్సవం సందర్భంగా 'పంజాబీ వాసుల' డిమాండ్లను అంగీకరించినందుకు, నల్ల చట్టాలను రద్దు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని భావిస్తున్నా. - అమరీందర్ సింగ్ ట్వీట్
రైతులు మిమ్మల్ని క్షమించరు. భాజపాను తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారు. ఎన్నికల భయంతోనే సాగు చట్టాలను రద్దు చేశారు. మళ్లీ ఎన్నికలు అయ్యాక తీసుకురారని గ్యారెంటీ ఏంటి? వాళ్లు రైతుల గురించి ఆలోచించడం లేదు. - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత