11 నెలలు.. 700 ప్రాణాలు.. దిల్లీ సరిహద్దులో రణరంగం లాంటి పరిస్థితులు.. ఇన్ని జరిగినా నూతన సాగు చట్టాల రద్దుపై భాజపా నిర్ణయం తీసుకోలేదు. కానీ.. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే మోదీ సర్కార్.. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తామని కీలక ప్రకటన చేసింది. అసులు ఈ సర్వే ఏం చెప్పింది? మోదీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు.


ఎప్పుడూ తగ్గలేదు..


పెద్ద నోట్ల రద్దు, సర్జికల్ స్టైక్స్, స్వచ్ఛ్ భారత్ అభియాన్, జీఎస్టీ.. నిర్ణయం ఏదైనా ఒకసారి తీసుకుంటే మోదీ వెనక్కి తగ్గలేదు. కానీ ఒక్క సాగు చట్టాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం భాజపాకు తప్పనిసరి. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలవక తప్పదు. అయితే ఇటీవల ఏబీపీ-సీఓటర్ చేసిన సర్వేలో పంజాబ్ మినహా ఉత్తర్‌ప్రదేశ్, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్ ఇలా అన్ని చోట్ల భాజపా గెలుపు ఖాయమని తేలింది. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 108 సీట్లు భాజపా కోల్పోయే అవకాశం ఉందని సర్వే చెప్పింది. ఇదే కాకుండా పంజాబ్‌లో ఒక్క సీటు కూడా భాజపా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ ఫలితాలే భాజపా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకునేలా చేశాయని విశ్లేషకులు అంటున్నారు.


108 అంటే..


ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేజిక్కించుకునే స్థాయిలో భాజపా ఉన్నప్పటికీ గతంలో సాధించినన్ని స్థానాలు పొందే అవకాశం లేదని సర్వే చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా రైతు ఉద్యమం ప్రభావం ఉంది. అదీ కాకుండా లఖింపుర్ ఘటన.. మోదీ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేసింది. ఏకంగా కేంద్ర మంత్రి కుమారుడే రైతులపైకి వాహనాన్ని ఎక్కించి ఐదుగురి ప్రాణాలు బలిగొన్నాడనే వార్తలు సంచలనంగా మారాయి. ఈ ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ఇప్పటికే చెప్పారు. ఇవన్నీ ఆలోచించిన భాజపా.. ఎన్నికల ముందు సాగు చట్టాలను రద్దు చేయడమే తగిన వ్యూహమని భావించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది వారికి ఎంత వరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి.


పంజాబ్‌లో జీరో..


పంజాబ్‌.. రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న మెజార్టీ రైతులు పంజాబ్‌ నుంచే ఉన్నారు. ఇక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకారం పంజాబ్‌లో భాజపా ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదని తేలింది. భాజపా.. పంజాబ్‌లో మళ్లీ నిలబడాలంటే సాగు చట్టాల రద్దు మాత్రమే సొల్యూషన్ అని అందుకే మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.


Also Read: Allahabad High Court: దేశంలో ఉమ్మడి పార స్మృతి అవసరం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


Also Read: Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. అలుపెరుగని యోధుడు.. అన్నదాతను నడిపించిన నాయకుడు!


Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన


Also Read: Farm Laws: జై కిసాన్.. ఏం చేస్తిరి.. ఏం పోరాటం చేస్తిరి.. అన్నదాత నీకు 'దేశం' సలాం


Also Read: 3 Farm Laws Repealed: మోదీ తలవంచారా? ఇది ఎన్నికల వ్యూహమా? రైతుల విజయమా?