Drunken Driving Rules: పుణెలో ఓ మైనర్ మద్యం మత్తులో పోర్షే కార్‌ నడిపి ఇద్దరిని బలి తీసుకున్న ఘటన దేశవ్యాప్తంగా అలజడికి కారణమైంది. మైనర్ అయినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా నిందితుడికి కఠిన శిక్ష విధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. చట్టపరంగా ఉన్న కొన్ని మినహాయింపులు వర్తించకుండా ఉండేలా జువైనల్ బోర్డుని ఆశ్రయించారు. 17 ఏళ్ల 8 నెలల వయసున్న నిందితుడుని మేజర్‌గానే పరిగణించాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అంత పెద్ద నేరం చేసిన వ్యక్తిని కేవలం మైనర్ అని వదిలేయడంపై వెల్లువెత్తుతున్న క్రమంలోనే డ్రైవింగ్ రూల్స్‌పై చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో మద్యం సేవించాలంటే పాతికేళ్లు నిండి ఉండాలి. అదే లీగల్. ఈ ప్రకారం చూస్తే పోర్షే కార్‌ యాక్సిడెంట్ ఘటనలో ఈ రూల్‌ని ఉల్లంఘించినట్టే లెక్క. కేవలం మహారాష్ట్రలోనే కాదు. దేశవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ రూల్స్‌ (Drink Driving Laws) అమల్లో ఉన్నాయి. 


ఇవీ రూల్స్..


మోటార్ వాహన చట్టం 1988 లోని సెక్షన్ 185 ప్రకారం డ్రగ్స్‌, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నిషేధం. అయితే...100 ml రక్తంలో 0.03% మాత్రమే ఆల్కహాల్‌ ఉంటే అది లీగల్‌గా చెల్లుతుంది. ఒకవేళ 100 ml రక్తంలో 30mg ఆల్కహాల్ కానీ డ్రగ్స్‌ కానీ డిటెక్ట్ చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాలు విధిస్తారు. మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 185 ప్రకారం మొదటిసారి డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఆర్నెల్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు. 2019కి ముందు ఈ జరిమానా రూ.2వేలు ఉండేది. ఆ తరవాత జరిమానాని పెంచారు.


ఇక రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.15 వేల వరకూ ఫైన్ విధిస్తారు. పదేపదే ఇలా పట్టుబడితే లైసెన్స్ రద్దు చేసేంత వరకూ కఠిన శిక్ష విధించే అవకాశాలున్నాయి. పైగా డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఇక మద్యం సేవించడానికి లీగల్ ఏజ్ 18-25 ఏళ్ల మధ్యలో ఉంది. రాష్ట్రాల వారీగా ఇది మారుతుంది. ఉదాహరణకు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవాలో 18 ఏళ్ల నుంచే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీలో మాత్రం 25 ఏళ్లు దాటిన తరవాతే మద్యం సేవించడానికి పర్మిషన్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, అసోంలో ఇది 21 ఏళ్లుగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మద్య నిషేధం అమలవుతోంది. 


పుణేలో ఓ మైనర్‌ మద్యం సేవించి పోర్షే కార్‌తో బీభత్సం సృష్టించినప్పటి నుంచి డ్రైవింగ్ రూల్స్‌ని మరోసారి ప్రస్తావిస్తున్నారు అధికారులు. అయితే...మైనర్ కావడం వల్ల చట్టం నుంచి కొన్ని మినహాయింపులు వర్తిస్తున్నాయి. దీనిపైనా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్స్ చేసినప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా చూడాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిబేట్ జరుగుతోంది. 


Also Read: New Driving Rules: మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25 వేల జరిమానా, రిజిస్ట్రేషన్ రద్దు - జూన్ 1 నుంచి కొత్త రూల్‌