PM Modi - Chennai Airport:
చెన్నైలో ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసిన వెంటనే చెన్నై బయల్దేరారు. అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏవియేషన్, రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్ వద్ద రూ.2,347 కోట్లతో నిర్మించిన టర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఆ తరవాత ఎయిర్‌పోర్ట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని మోదీతో పాటు తమిళనాడు సీఎం ఎమ్‌కే స్టాలిన్ ఉన్నారు. కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ఎల్ మురుగన్ ప్రధాని వెంటే ఉన్నారు. ఆ తరవాత వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌నీ ప్రారంభించారు మోదీ. చెన్నై, కోయంబత్తూర్ మధ్య సేవలు అందించనుంది ఈ ట్రైన్. తమిళనాడుకు ఇదే తొలి ఎక్స్‌ప్రెస్. అంతకు ముందు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ఎయిర్‌పోర్ట్ బిల్డింగ్ ఫోటోలు పోస్ట్ చేశారు. చెన్నైలోని మౌలిక వసతుల్లో ఇదెంతో ప్రత్యేకం అని వెల్లడించారు. కనెక్టివిటీని పెంచడంతో పాటు ఆర్థికంగానూ ఇదెంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో 108 ఇమిగ్రేషన్ కౌంటర్‌లున్నాయి. 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. చెన్నై ప్రజల ప్రయాణాన్ని ఈ టర్మినల్ మరింత సులభతరం చేస్తుందని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమాల తరవాత శ్రీరామ కృష్ణ మఠ్ 125వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే...అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మోదీ పర్యటనకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గో బ్యాక్ మోడీ అంటూ నల్ల జెండాలు పట్టుకుని నినదిస్తున్నాయి.
టర్మినల్ ప్రత్యేకతలివే..
1.ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ టర్మినల్ వల్ల ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణం చేసేందుకు వీలవుతుంది.
2. ఈ టర్మినల్ బిల్డింగ్‌లో తమిళనాడు సంస్కృతి ఉట్టిపడేలా పలు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఆలయాలను ప్రతిబింబించే విధంగా నిర్మాణం చేపట్టారు.
3.ఈ టర్మినల్ సీలింగ్‌కు కూడా ప్రత్యేకత ఉంది. మోటిఫ్ లైట్‌లు ఏర్పాటు చేశారు. కోలమ్ ప్యాటర్న్‌లో వీటిని తీర్చిదిద్దారు. పిల్లర్‌లను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. వాటిపై బంగారు పూత పూశారు.
4. ఇందులో మరో ప్రత్యేకత స్కైలైట్. సహజమైన కాంతిని తీసుకుని టర్మినల్‌లో వెలుగులు పంచుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గనుంది.