Bandi Srinivasa Rao : తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో బండి శ్రీనివాసరావు శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకి బకాయిలుగా ఉన్న రూ.1900 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏల చెల్లింపుతో పాటు మరో మూడు డీఏలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏప్రిల్ మాసంలో జీతాలు ఇవ్వడం ఆలస్యం అవుతుందన్నారు. ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీకి జీతాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రస్తుతం 10వ తారీఖున జీతాలు పడుతున్నాయన్నారు. 


ప్రభుత్వానికి సమయం ఇచ్చాం 
 
"ప్రభుత్వం దగ్గర ఉద్యోగులకు రావాల్సి బకాయిల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.1900 కోట్లు విడుదల చేసింది. పోలీసులకు సరెండర్ లీవులు, పెండింగ్ ఉన్న 5 డీఏలు, ప్రభుత్వం మరో 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఏపీ ఎన్జీవోస్ తరఫున ప్రభుత్వానికి సమయం ఇస్తాం. పదో తారీఖున జీతాలు పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి అనేక విధాలుగా విజ్ఞప్తులు చేశాం. కొత్త సంవత్సరంలోనైనా ఒకటో తారీఖుల జీతాలు వేస్తారని భావిస్తు్న్నాం." -  బండి‌ శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు


ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఆందోళనలు 


ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తుంది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలియజేసింది.  ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు, పింఛన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రతిపాదిత వేతన స్కేళ్లు అమలుచేయాలని కోరారు. పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, సమయానికి జీతాలు ఇవ్వడంలేదని  ప్రభుత్వంపై బొప్పరాజు విమర్శలు చేశారు. ఉద్యోగులకే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వాలంటీర్లు, సలహాదారులకు రూ. 20 వేల కోట్లు ఇస్తున్న మాట వాస్తవకం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సర్వీసు రూల్స్ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలలో ఉద్యోగుల పరిస్థితి బాగుందన్న బొప్పరాజు, మలిదశ పోస్టర్లు విడుదలతో ఉద్యమం మరితం తీవ్రతరం అవుతుందన్నారు. ప్రభుత్వ యాప్ వినియోగాన్ని నిలిపి వేస్తూ సెల్ ఫోన్ డౌన్ చేస్తామని తెలిపారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడంలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలు తీర్చాలని కోరారు.