Karnataka Elections 2023:
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పూర్తి స్థాయిలో ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చేశాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇప్పుడీ విషయంలోనే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. టికెట్‌లు కేటాయించడంలో రెండు పార్టీలు అంతర్మథనం చెందుతున్నాయి. సీనియర్ నేతలందరూ టికెట్ కోసం క్యూ కడుతున్నారు. వాళ్లను కాదని కొత్త వాళ్లకు ఇచ్చే పరిస్థితుల్లో రెండు పార్టీలు లేనట్టే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 166 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఇంత వరకూ ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త ముందంజలోనే ఉంది. అందుకే..బీజేపీపై విమర్శలు మొదలు పెట్టింది. బీజేపీలోని నేతలందరూ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారని, ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చేసిన కామెంట్స్ బీజేపీకి ఆగ్రహం కలిగించాయి. సీనియర్ నేతలందరూ పోటీకి దూరంగా ఉన్నారనీ అన్నారు సుర్జేవాలా. అందుకే స్టార్ క్యాంపెయినర్‌లపైన ఆధారపడ్డారంటూ విమర్శించారు. దీనిపై గట్టిగానే బదులు చెబుతోంది కాషాయ పార్టీ. బీజేపీ రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. సిద్దరామయ్యను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలో అర్థంకాక కాంగ్రెస్ తలపట్టుకుంటోందంటూ సెటైర్‌లు వేశారు. అంతకు ముందు 2018లో సిద్దరామయ్య బదామీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడా నియోజకవర్గాన్నే ఆయన కాదనుకుంటున్నారని అన్నారు లహర్ సింగ్. చాముండేశ్వరి నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
సందిగ్ధంలో కాంగ్రెస్
రాహుల్ గాంధీపైనా విమర్శలు చేసిన లహర్ సింగ్...ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పడుతోందని అన్నారు. సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని డిమాండ్ చేస్తున్నారని, ఇది అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారిందని తేల్చి చెప్పారు. అయితే..మొదట కోలార్ నుంచి పోటీ చేస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. ఆ తరవాత పరిణామాలు మారిపోయాయి. వరుణ నియోజకవర్గం ఫైనల్ అయింది. దీంతో పాటు మరో చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో తర్జనభర్జన పడుతోంది. "ఒక అభ్యర్థికి ఒకే సీటు" పాలసీని అమలు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే మరో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది కాంగ్రెస్. ఇక బీజేపీ మరో రెండు రోజుల్లో ఈ లిస్ట్‌ను ఫైనలైజ్ చేయనుంది.