Foreign Universities Campus in India:


ఆ మూడు యూనివర్సిటీల క్యాంపస్‌లు..


ఉన్నత చదువులు అనగానే భారత్‌లోని యువతీ యువకులు వెంటనే అబ్రాడ్‌కు వెళ్లిపోవాలని అనుకుంటారు. అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్‌ కూడా బాగానే ఉంది. అందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీలు కూడా వెలిశాయి. ఫారిన్‌ యూనివర్సిటీల్లో బెస్ట్ ఏంటి అనగానే... అందరూ ఆక్స్‌ఫర్డ్ గురించే చెబుతారు. ఆ తరవాత యేల్‌, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలకూ చాలా మంది అప్లై చేస్తుంటారు. అయితే...ఈ యూనివర్సిటీల్లో చదువుకోడానికి ఇకపై విదేశాలకు వెళ్లాల్సిన పని లేదని అంటోంది కేంద్రం. ఆయా యూనివర్సిటీల క్యాంపస్‌లను భారత్‌లోనే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే...ఇక్కడే చదువుకుని ఆయా వర్సిటీల పట్టాలు అందుకునే అవకాశముంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకుని...ఆయా వర్సిటీల క్యాంపస్‌లు భారత్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తు న్నారట. University Grants Commission (UGC)ఇప్పటికే దీనిపై ఓ ముసాయిదా తయారు చేసింది. ప్రజల ఫీడ్‌బ్యాక్‌ కోసం ఈ డ్రాఫ్ట్ రూపొందించింది. అంతా సవ్యంగా జరిగితే...ఆ యూనివర్సిటీలు క్యాంపస్‌లు భారత్‌లోనే రెడీ అయిపోతాయి. "స్థానికంగా క్యాంపస్‌లు ఏర్పాటు చేసే ఫారిన్ యూనివర్సిటీలు..అడ్మిషన్‌లు, ఫీజులు, స్కాలర్‌షిప్స్‌ తదితర విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయి. 


యూజీసీ డ్రాఫ్ట్..


ఫ్యాకల్టీ నియామకంలోనూ పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది" అని యూజీసీ తయారు చేసిన డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు అంతర్జాతీయ  విద్యను అందించేందుకు మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్య పూర్తి చేసుకునే విధంగా చొరవ చూపుతున్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే విదేశీ విద్య కోసం చూస్తున్న ఎందరో విద్యార్థుల కలలు నెరవేరతాయి. అయితే...యూజీసీ తయారు చేసిన ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తరవాతే చట్టం చేస్తారు. మొదటగా పదేళ్ల పాటు క్యాంపస్‌ నడిపేందుకు అనుమతినిచ్చి...ఆ తరవాత ఆ గడువుని పొడిగించే ఆలోచనలో ఉంది యూజీసీ. అనుమతి లభించిన రెండేళ్ల లోపే కచ్చితంగా ఇక్కడ యూనివర్సిటీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. "కొత్త విద్యా విధానం  ప్రకారం భారత్‌లోని ఉన్న విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను సిద్ధం చేశాం. టాప్ 500 లో ఉన్న యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు" అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. 


వీసా కష్టాలు..


అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి వీసా చిక్కులు ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వెయిటింగ్ టైమ్‌ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా వరకూ యూనివర్సిటీలు మూత పడ్డాయి. భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. కొంత కాలంగా అన్ని యూనివర్సిటీలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఫలితంగా...వీసాల అప్లికేషన్లు కుప్పల కొద్ది వచ్చి పడుతున్నాయి. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అమెరికా చొరవ చూపూతోంది. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్ టైమ్‌ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతకు ముందుతో పోల్చి చూస్తే...2022లోనే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎక్కువ వీసాలు ఇచ్చినట్టు వివరించింది. 


Also Read: Air India Case: ప్లైట్‌లో మహిళపై యూరినేట్ చేసిన వ్యక్తిపై లుకౌట్ నోటీసులు, ముంబయిలో పోలీసుల గాలింపు