Tesla Sales in China: ప్రపంచంలోనే అతి ఖరీదైన టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు (Tesla Electric Cars) చైనాలో చాలా చవగ్గా దొరుకుతున్నాయి. డ్రాగన్‌ కంట్రీలో (China) పోటీని తట్టుకోవడానికి టెస్లా CEO ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), కార్ల రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు. ఇవాళ కూడా (శుక్రవారం, 06 జనవరి 2023) మరో దఫా ధర తగ్గించారు.


శుక్రవారం, మోడల్ 3 (Model 3) & మోడల్‌ వై (Model Y‌‌) ఎలక్ట్రిక్ కార్ల మీద మరో రౌండ్ ధరలను ఆ కంపెనీ తగ్గించింది, అదే సమయంలో, ప్రీమియం విభాగంలో పట్టును పెంచుకోవడానికి హై-ఎండ్ మోడల్ ఎస్‌ సెడాన్ (Model S) & మోడల్ ఎక్స్‌ను (Model X ) కూడా లాంచ్‌ చేసింది.


టెస్లా కంపెనీ చైనీస్ వెబ్‌సైట్ ప్రకారం... స్థానికంగా రూపొందించిన మోడల్ Y స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ ప్రారంభ ధరను 2,88,900 యువాన్‌ల నుంచి 2,59,900 ($37,875) యువాన్‌లకు తగ్గించింది. బడింది. ఇది చైనాలో రికార్డు స్థాయి తక్కువ ధర. అంతేకాదు, టెస్లా US వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేసిన అదే మోడల్‌ ధర ప్రారంభ ధర $65,900 కంటే 43% తక్కువ. మోడల్ 3 ధరను సైతం 2,65,900 యువాన్‌ల నుంచి 2,29,900 యువాన్‌లకు తగ్గించింది. ఇది USలో అమ్ముతున్న రేటు కంటే 30% తక్కువ.


తీవ్రమైన పోటీ
ప్రపంచంలో అతి పెద్ద EV మార్కెట్‌ చైనా. ఇక్కడ దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీల నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. మార్కెట్‌లో నిలబడడానికి, మాస్‌ & క్లాస్‌ (ప్రీమియం) రెండు విభాగాల్లోనూ గత ఏడాది భారీగా రేట్లను టెస్లా తగ్గించింది. 


వారెన్ బఫెట్‌ పెట్టుబడులు ఉన్న బీవైడీ కంపెనీ (BYD Co), పెంగ్‌ (Xpeng Inc), నియో (Nio Inc), పోర్షే (Porsche AG), మెర్సిడెజ్‌ బెంజ్‌ (Mercedes Benz) వంటివి చైనీస్‌ మార్కెట్‌లో టెస్లాకు పోటీ కంపెనీలు.


టెస్లా కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ S (రీడిజైన్డ్‌ ఇంటీరియర్‌ వెర్షన్‌) చైనా ధర 7,89,900 యువాన్లు కాగా... ప్లాడ్ వెర్షన్ (Plaid version) రేటు 1.01 మిలియన్ యువాన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది టెస్లా సూపర్‌ ఫాస్ట్‌ కార్‌. 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) వేగాన్ని అందుకోవడానికి 2.1 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది. మోడల్ X SUV ధర 8,79,900 యువాన్లు - మోడల్ X ప్లాడ్ వెర్షన్‌ ధర 1.04 మిలియన్ యువాన్లు. వీటికి సంబంధించి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయని టెస్లా తెలిపింది.


టెస్లా, 2022లో చైనా నుంచి 7,10,000 వాహనాలను డెలివెరీ చేసింది, దాని ప్రపంచవ్యాప్త అమ్మకాలలో ఇది 54%. డిసెంబరులో పరికరాల నవీకరణల (equipment upgrades) కోసం ఉత్పత్తి ఆ కంపెనీ తాత్కాలికంగా నిలిపేయడంతో డెలివరీలు మందగించాయి, డిమాండ్ తగ్గింది. గ్లోబల్ డెలివరీలు మూడో త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నాయని టెస్లా ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత టెస్లా షేర్‌ ధర మరోమారు భారీగా పడిపోయింది.