PM Modi's Diwali Gift: దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. 75 వేల మంది యువతకు గిఫ్ట్ ఇవ్వనున్నారు. అక్టోబర్ 22న 75 వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.






రోజ్‌గార్ మేళా


పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను మోదీ అందించనున్నారు. అక్టోబరు 22న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ 'రోజ్‌గార్‌ మేళా'ను ప్రారంభించనున్నట్లు పీఎంఓ గురువారం వెల్లడించింది.


రక్షణ, రైల్వే, హోం, కార్మిక-ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో ఈ సందర్భంగా మోదీ ముచ్చటించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.


హామీ ప్రకారం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది జూన్‌లో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, ఖాళీల వివరాలపై అన్ని శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మేరకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ హామీ ప్రకారమే 75 వేల మందికి దీపావళి కానుకగా అపాయింట్‌మెంట్ లెటర్లు మోదీ ఇవ్వనున్నారు.






కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 2 మిలియన్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు తరచుగా విమర్శిస్తుంటాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విపక్షాలు తరచూ విమర్శలు చేస్తుంటాయి.


ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీపై డిమాండ్లు రావడం, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో నిరుద్యోగిత ఒకటి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 


Also Read: Firecracker Godown Blast: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు- నలుగురు మృతి!