ABP  WhatsApp

CM Jagan Counters Pawan: మూడు పెళ్లిళ్లు చేసుకోమనేవారు నాయకులా? వారి బతుకులు ఏమవుతాయ్ - పవన్‌కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్

ABP Desam Updated at: 20 Oct 2022 02:30 PM (IST)

ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

సభలో మాట్లాడుతున్న సీఎం జగన్

NEXT PREV

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అవసరమైతే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని పవన్ కల్యాణ్ అంటూ ఏం సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మాదిరిగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా అని ప్రశ్నించారు. అదే జరిగితే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా చేస్తే మన ఇళ్లలో ఉన్న అక్కచెల్లెమ్మలు, భార్యలకు విడాకులు ఇచ్చేయాల్సి వస్తుందని, వారి బతుకులు ఏమవుతాయని ఘాటుగా స్పందించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్పేవారిని మనం నాయకులుగా భావించాలా? అని నిలదీశారు. 


ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ 22ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.



ఎవ్వరికీ అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికి మేలు జరుగుతుందని మనం చెబుతుంటే, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతున్నారు. మీరూ ఆలోచన చేయండి. రేపొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన ఇంట్లో కూతుర్ల పరిస్థితి ఏంటి? చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు నాలుగేళ్లు కాపురం చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది. ఒకసారి కాకుండా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఆడవాళ్ల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు? వీరు మనకు దశా దిశా చూపగలరా?- సీఎం జగన్


నాయకులుగా భావిస్తున్నవారు చెప్పులు చూపిస్తూ బూతులు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఓ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, అలాంటి వారు మన నాయకులా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడిగా, చంద్రబాబును దత్త తండ్రిగా సీఎం జగన్ సంబోదించారు. దత్త తండ్రి చెప్పినట్లుగానే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరికి రకరకాల మీడియా సంస్థలు అండగా నిలబడుతున్నాయని, దత్త పుత్రుడు కూడా అండగా ఉంటున్నాడని అన్నారు. తాను మాత్రం భగవంతుడి దయ, ప్రజల ప్రేమాభిమానాలనే నమ్ముకున్నానని అన్నారు. వీరంతా ఏకమై జగన్ ను కొట్టాలని చూస్తున్నారని అన్నారు.



ఇది మంచికి - మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. పేదవాడికి పెత్తం దార్లకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. - సీఎం జగన్


లబ్ధిదారులకు భూపత్రాల అందజేత


స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడంతో వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం జగన్ అన్నారు. వాటిని తొలగించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల క్లియరెన్స్‌ పత్రాలను లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేశారు. రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వం ఆలోచించలేదని, భూ యాజమాన్య విషయంలో, చివరికి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నారని అన్నారు. అందుకే భూముల రీ సర్వేను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని చెప్పారు.


పదిహేను వేల మంద సర్వేయర్లను ఇందుకోసం రిక్రూట్‌ చేశామని, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే చేస్తున్నామని అన్నారు. చుక్కల భూములని, అనాధీన భూములని నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపించామని అన్నారు. నవంబర్‌లో 1,500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి సరిహద్దులు నిర్ణయించడంతో పాటు భూ హక్కు పత్రాలు అందజేస్తామని అన్నారు.

Published at: 20 Oct 2022 01:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.