Plant Blindness పై జరుగుతున్న పరిశోధనలు
కళ్లు మూసుకుంటే ఏం గుర్తొస్తుందనే దానిపై చర్చ
ప్రపంచంలో చాలా మందికి గుర్తొచ్చేది జంతువులే
మొక్కలపై ఎక్కువగా అవగాహన లేకపోవటమే కారణం
ఒకసారి కళ్లు మూసుకుని ప్రకృతిని ఊహించుకోండి. ఓ దట్టమైన అడవిలో ఉన్నారనుకోండి. మీకు ఏం కనిపిస్తున్నాయి. ఏదైనా జంతువు మీ మైండ్ లోకి వచ్చిందా. ఒకవేళ వస్తే మీకు ప్లాంట్ బ్లైండ్ నెస్ (Plant Blindness) ఉన్నట్లే. అదేంటీ జంతువు వస్తే ప్లాంట్ బ్లైండ్ నెస్ ఉన్నట్లు ఎలా అవుతుంది. నాకు మొక్కలు కూడా కనిపిస్తాయి అంటారా. ఇది అలా కాదు. ఈ పదానికి ఓ రీజన్ ఉంది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
మన డీఎన్ఏలో జీర్ణించుకుపోయిన భయం
మనుషులంతా అడవిలో ఆదిమానవుల్లా జీవించటం మొదలు పెట్టినప్పుడు క్రూర మృగాల భయం ఉండేది. ఎటు నుంచి ఏ పులినో, సింహమో దాడి చేస్తుందేమోనని భయపడేవాళ్లం. అందుకే మన బాడీ అంతా జంతువుల కదలికలపై కాన్షియస్ గా ఉండేది. ఇదేం ఒకరోజో రెండు రోజులో జరగలేదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మన డీఎన్ఏలో జీర్ణించుకుపోయిన భయం ఇది. అందువల్ల మనకు జంతువులతో పోలిస్తే మొక్కలంటే ఓ రకమైన చిన్నచూపు. వాటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉండదు కాబట్టి. మన మైండ్ అంతా జంతువుల చుట్టూ తిరుగుతోంది. ఇలా మొక్కలను మనం అంతగా గుర్తించలేకపోవటాన్ని ప్లాంట్ బ్లైండ్ నెస్ అంటున్నారు జెనెటిక్ సైంటిస్టులు.
Also Read: Earth Shortest Day: భూమికి తొందరెక్కువైందా? ఎందుకింత వేగంగా తిరుగుతోంది?
మొక్కలకు అంతే ప్రాధాన్యత
మనం రోజూ ఆహారంలో భాగంగా తీసుకునే కొన్ని పదుల సంఖ్యలో మొక్కలు తప్ప మనకు మిగిలినవి పెద్దగా పట్టవు. మన పెరట్లోనే అనేక రకాల మొక్కలు కనిపించినా వాటి పేరు తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేయరు. ఇవన్నీ కూడా ప్లాంట్ బ్లైండ్ నెస్ కిందకు వస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ భూమిపై జంతువులకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత మొక్కలకు ఉంది.
ప్రపంచంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువులు 5వేల వరకూ ఉంటే... అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు ఏకంగా 30 వేలకు పైమాటే అంట. సో మొక్కలను కాపాడుకోవటం కూడా మన బాధ్యతే. దీని కోసం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ప్రకృతితో పాటు కాసేపు సమయాన్ని గడిపితే చాలు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం లాంటివి చేస్తే చాలు అంటున్నారు సైంటిస్టులు. ప్రత్యేకించి తర్వాతి తరాల పిల్లలకు మొక్కలను ఎక్కువగా పరిచయం చేయటం ద్వారా వాటి విలువను తెలిసేలా చేయవచ్చేనేది మరో సలహా.
మీకు ఇంకో విషయం తెలుసా... పక్షులు దూరంగా చేస్తున్న శబ్దం.. గలగల పారుతున్న సెలయేరు... వర్షం తర్వాత వచ్చే మట్టివాసన లాంటివి ఎక్స్ పీరియన్స్ చేయటం ద్వారా శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించొచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Mark Zuckerberg Space Walk: అరుదైన ఘనత సాధించిన Facebook CEO మార్క్ జుకర్ బర్గ్, మెటావర్స్ లో స్పేస్ వాక్