Earth Shortest Day: 


భూమి వేగంగా తిరుగుతోంది..


"ఏంటో ఈ టైమ్ ఇంత తొందరగా గడిచిపోతోంది" అని రామారావు అంటే..."కాలం ఎవరి కోసమూ ఆగదు" అని సుబ్బారావు అంటాడు. టైమ్‌ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రోజు గడిచిపోతుంది. మళ్లీ రేపు అనేది వస్తుంది. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియే. కానీ..."రేపు" అనేది కాస్త ముందస్తుగానే వస్తే..? అదెలా సాధ్యం అనుకోకండి. ఇప్పటికే అది జరిగింది కూడా. సాధారణంగా 24 గంటల పూర్తైతే ఓ రోజు కంప్లీట్ అవుతుంది. రోజు మారుతుంది. కానీ...ఈ రోజు మారటం అనేది సాధారణం కన్నా కాస్త ముందుగానే జరిగింది. క్లియర్‌గా చెప్పాలంటే...భూ భ్రమణం వేగం పెరిగింది. జూన్ 29వ తేదీన భూగోళం...24 గంటల కన్నా 1.59మిల్లీ సెకండ్లు ముందుగానే భ్రమణం పూర్తి చేసుకుంది. అంటే ఆ రోజు ముందుగానే ముగిసిపోయిందన్నమాట. అప్పుడెప్పుడో 1960ల్లో ఓ సారి ఇలా జరగ్గా..ఆ తరవాత ఇప్పుడే భూమి చాలా తొందరగా భ్రమణం పూర్తి చేసుకుంది. నిజానికి ఈ విషయాన్ని ప్రస్తుతం అధికారికంగా గుర్తించినప్పటికీ...చాలా రోజులుగా భూభ్రమణం వేగవంతం అయిందన్నది ఖగోళ శాస్త్ర నిపుణుల మాట. జూన్‌ 29 తరవాత, జులై 26వ తేదీన  భూభ్రమణం 1.50 మిల్లీసెకండ్లకు ముందుగానే ముగిసిపోయింది. అంటే ఆ రోజు ముందుగానే గడిచిపోయింది. మరో ఆశ్చర్యకరమ విషయం ఏంటంటే... ప్రపంచమంతా 2020లో కరోనాతో పోరాటంలో మునిగిపోయినప్పుడూ ఇదే జరిగింది. ఆ ఏడాదిలో దాదాపు 28 రోజులు "షార్టెస్ట్ డేస్‌"గా రికార్డ్అ య్యాయి. 2020లో జులై 19న ఆ "రోజు" 1.47 మిల్లీసెకండ్ల ముందుగానే కంప్లీట్ అయింది. సెకన్‌లో వెయ్యో వంతుని మిల్లీసెకండ్‌గా పరిగణిస్తారు. 


ఇలా జరగటం కొత్తేమీ కాదా..? 


ఈ మధ్య కాలంలో భూమి సాధారణం కన్నా వేగంగానే తిరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే భూభ్రమణం "నెమ్మది"గానే జరుగుతోందని అంటున్నారు. శతాబ్దం గడిచే కొద్ది "ఓ రోజు" ముగిసే కాలం పెరుగుతూ వస్తోంది. మిల్లీ సెకండ్ల మేర ఇది అధికమవుతోంది. 100 కోట్ల సంవత్సరాల క్రితం చూస్తే..."రోజు" 19 గంటల కన్నా ముందుగానే ముగిసిపోయేదని "ది గార్డియన్" పత్రిక 2018లో వెల్లడించింది. అప్పట్లో అంత వేగంగా భూమి తిరిగేది. అయితే రానురాను చంద్రుడి ఆకర్షణ శక్తి పెరగటం వల్ల భూభ్రమణ సమయం అధికమవుతూ వచ్చింది. మరి ఇప్పుడు మళ్లీ ఎందుకు "షార్టెస్ట్ డేస్" నమోదవుతున్నాయన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో శాస్త్రవేత్తలకూ స్పష్టత రావటం లేదు. "చాలా వింతగా ఉంది" అనే సమాధానమే ఇస్తున్నారంతా. "మనకు అంతుపట్టని విషయం ఏదో జరుగుతోంది" అని మరికొందరు వివరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భూ ఉపరితలంలో మార్పులు రావటమూ ఇందుకు ఓ కారణం అయుండొచ్చు అని కొందరు అంచనా వేస్తున్నారు. అంటార్కిటికాలోని ఐస్ షీట్స్ కరిగిపోవటం వల్ల భూ ఉపరితలంపై ప్రభావం పడుతోంది. 


ఇదంతా చాండ్లర్ వాబుల్ ప్రభావమేనా..? 


జియోగ్రాఫికల్ పోల్స్‌ కదలికల్లో మార్పులు రావటాన్ని "చాండ్లర్ వాబుల్‌" (Chandler Wobble) అంటారు. కక్ష్యలో కాకుండా కాస్త పక్కకు జరిగి భూమి భ్రమించటాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం "రోజు" తొందరగా ముగిసిపోవటానికి కారణం ఇదే అయ్యుంటుందని శాస్త్రవేత్తలు కొందరు చెబుతున్నారు. "గాలి వీచే దిశలు మారిపోవటం, సముద్ర జలాల కదలికల్లో మార్పులు రావటం" లాంటి కారణాలు..భూభ్రమణంపై ప్రభావం చూపిస్తాయని నాసా వెల్లడించింది. భూభ్రమణం ఆధారంగా, మన గడియారంలో టైమ్‌ని మ్యాచ్ చేసేందుకు లీప్ సెకండ్స్ అనే విధానాన్ని 1970ల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC)కి ఒక సెకండ్‌ని చేర్చటం ద్వారా మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల్లో "గడియారాల్ని" సింక్రనైజ్ చేసుకునేందుకు వీలైంది. క్రమక్రమంగా భూభ్రమణం నెమ్మదించటం వల్ల UTCకి 27 లీప్ సెకండ్లు యాడ్ చేశారు. ఒకవేళ భూభ్రమణం వేగవంతమై, "షార్టెస్ట్ డేస్" తరచుగా నమోదైతే, అప్పుడు శాస్త్రవేత్తలు "నెగటివ్ లీప్ సెకండ్‌"ని తీసుకురావాల్సి ఉంటుంది. అంటే గడియారాల్లో ఒక "సెకన్‌" ను తీసేయటం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని గడియారాలను సింక్రనైజ్ చేస్తారన్నది ఓ వివరణ. కారణాలేవైనా, భూభ్రమణం వేగం పెరుగుతూ...ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి సైంటిస్ట్‌లకూ సవాలు విసురుతోంది. 


Also Read: Sita Ramam Review: సీతా రామం రివ్యూ: హృదయాన్ని తాకే సీతారాముల కథ!


Also Read: Controversial Madhav : ఖాకీ యూనిఫాంలోనే కాదు ఖద్దరు డ్రెస్‌లోనూ వివాదమే ఇంటి పేరు ! గోరంట్ల ట్రాక్ రికార్డ్ ఇదిగో