సినిమా రివ్యూ: సీతారామం
రేటింగ్: 3.5/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
నిర్మాణ సంస్థ : వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్
నిర్మాత: అశ్వనీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్
దర్శకత్వం: హను రాఘవపూడి
విడుదల తేదీ: ఆగస్టు 5, 2022


దుల్కర్ సల్మాన్ సినిమా అనగానే కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కథల ఎంపికలో వైవిధ్యం, చేసే ప్రతి పాత్రకు ప్రాణం పోయగల ప్రతిభ తనకు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ప్రేమ కథలు దుల్కర్ సల్మాన్‌కు కొట్టిన పిండి. అటువంటి ప్రేమకథలను దృశ్యకావ్యంలా తీయగల హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడనగానే అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్, ట్రైలర్లు, పాటలు... ఇలా విడుదలైన కంటెంట్ మొత్తం ఆ అంచనాలను మరింత పెంచి సినిమాకు బజ్‌ను తీసుకొచ్చాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా?


కథ: ఈ కథ రెండు కాలాల్లో సమాంతరంగా సాగుతుంది. 1985లో లండన్‌లో చదువుతున్న పాకిస్తాన్ విద్యార్థి అఫ్రీన్‌కు (రష్మిక మందన్న) భారతదేశం అంటే పడదు. తప్పు తనదైనా ఎదుటివారికి సారీ చెప్పడానికి కూడా ఇష్టపడనంత అహంకారం. కానీ ఒకానొక సందర్భంలో తనకు అర్జెంట్‌గా పది లక్షలు అవసరం అవుతాయి. డబ్బుల కోసం తన తాతయ్య, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ పారిఖ్ (సచిన్ ఖేడ్కర్) ఇంటికి రెండు సంవత్సరాల తర్వాత వెళ్తుంది. కానీ అప్పటికే ఆయన చనిపోతారు. ఆస్తి కోసం లాయర్‌ను కలిసినప్పుడు తాత చివరిగా రాసిన ఉత్తరం చదువుతుంది. 1965లో ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్), సీతకు (మృనాల్ ఠాకూర్) రాసిన చివరి ఉత్తరాన్ని చేరిస్తేనే ఆస్తి దక్కుతుందని వీలునామాలో పేర్కొంటారు. అసలు రామ్, సీత ఎవరు? ఇండియన్ లెఫ్టినెంట్ రాసిన ఉత్తరం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ చేతికి ఎలా వచ్చింది? వీరి కథేంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: ప్రేమ కథలు రాయడంలో, తీయడంలో హను రాఘవపూడిది ప్రత్యేకమైన శైలి. పదేళ్ల కెరీర్‌లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్‌లు లేనప్పటికీ తన సినిమా కోసం ఎదురుచూసే వారు ఉన్నారంటే తన శైలే కారణం. అందమైన విజువల్స్‌తో స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేయడం హను స్పెషాలిటీ. మరి అంత అందమైన విజువల్స్‌కు బలమైన కథ తోడయితే అది సీతారామం అవుతుంది. ఇప్పటివరకు హను రాఘవపూడి తీసిన సినిమాల్లో ది బెస్ట్ ఇదే అని కచ్చితంగా చెప్పవచ్చు.


ఈ సినిమాకు ప్రాణం ఇందులోని పాత్రలు, వాటి చుట్టూ ఉన్న సంఘర్షణ. అనాథ అయిన రామ్ జీవితంలోకి ఎవరో తెలియని సీత ఉత్తరాల రూపంలో వస్తుంది. సెలయేరు లాంటి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లిన రామ్‌కి తనలో సముద్రమంత ప్రేమను నింపుకున్న సీత కనిపిస్తుంది. రామ్ సీతను వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ సినిమాలోని హైలెట్స్‌లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా కథను రెండు ముక్కల్లో చెప్పాలంటే మొదట సీత కోసం రామ్ ప్రయాణం, తర్వాత రామ్ కోసం సీత ప్రయాణం. వీటిని పాకిస్తాన్‌కు చెందిన అఫ్రీన్‌తో కనెక్ట్ చేస్తూ హను స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు.


సినిమాలో లవ్, ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్, రష్మికల మధ్య దుల్కర్ సల్మాన్, వెన్నెల కిషోర్‌ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌లు నవ్విస్తాయి. అలాగే ట్రైన్‌లో టీసీగా సునీల్ కనిపించే సన్నివేశం కూడా బాగా పేలింది. హను రాఘవపూడి సినిమాల్లో బాగా వినిపించే కంప్లయింట్ సినిమా సెకండాఫ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేడని. ఈ సినిమాతో ఆ కంప్లయింట్ ఇంక వినిపించదని హను ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనే చెప్పారు. తను చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ కూడా. ఎందుకంటే సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. సెకండాఫ్ విషయంలో హను తీసుకున్న శ్రద్ధ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది.


హను రాఘవపూడి మరో బలం తనకు ఉన్న మ్యూజిక్ సెన్స్. ఇప్పటివరకు హను రాఘవపూడి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ తన సినిమాల్లో సంగీతం మాత్రం నిరాశ పరచలేదు. అందాల రాక్షసి నుంచి పడి పడి లేచె మనసు వరకు తన ప్రతి సినిమాలో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్, బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటాయి. ఈ సినిమాకు మ్యూజిక్ మరింత ప్లస్ అయింది. విశాల్ చంద్రశేఖర్ పాటలకు అందమైన బాణీలు కడితే వాటికి తన పిక్చరైజేషన్‌తో హను ప్రాణం పోశాడు. ప్రతి పాట చూడటానికి తెరపై దృశ్యకావ్యంలా ఉంటుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.


పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణల సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించింది. ముఖ్యంగా కశ్మీర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అయితే కనుల విందు అనే చెప్పాలి. 1960, 80ల నాటికి చెందిన లుక్‌ను సినిమాకు తీసుకురావడంలో క్రెడిట్ వీరిదే. సంభాషణలు కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. ‘ఇంత అందం అబద్ధం చెప్తే... నిజం నిజంగానే ఒప్పుకుంటుందేమో’ వంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. అశ్వనీ దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. ఈ నిర్మాణ విలువలు స్క్రీన్‌పై అందంగా కనిపిస్తాయి.


ఎంత బలమైన పాత్రలు ఉన్నా ఆ బరువును తమ భుజాలపై మోయగలిగే నటులు దొరికేతేనే ఆ పాత్రలు ఎలివేట్ అవుతాయి. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్‌పై మనకు దుల్కర్ సల్మాన్ ఏమాత్రం కనిపించడు. కేవలం లెఫ్టినెంట్ రామ్ మాత్రమే కనిపిస్తాడు. రామ్ పాత్రకు తను తప్ప ఎవరూ న్యాయం చేయలేరు అన్నంతగా దుల్కర్ ఒదిగిపోయాడు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఇలా ప్రతి సన్నివేశంలోనూ తన బెస్ట్ ఇచ్చాడు. ఇక సీతగా కనిపించిన మృనాల్ ఠాకూర్‌కు ఇది గొప్ప అవకాశం. మొదటి సినిమాలోనే ఇంత బరువైన పాత్ర దొరికింది. ఆ పాత్రకు తను 100 శాతం న్యాయం చేసింది. ఈ సినిమా తర్వాత తనకు పెద్ద అవకాశాలు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు. సినిమా పూర్తయి బయటకు వచ్చాక రామ్, సీతల పాత్రల్లో దుల్కర్, మృనాల్ తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం.


Also Read : పేపర్ రాకెట్ రివ్యూ: చావు బండి నుంచి బతుకు వరకూ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?


వీరిద్దరి తర్వాత ముఖ్యమైన పాత్రలు రష్మిక మందన్న, సుమంత్‌లవి. ఎంతో యారోగెంట్‌గా ఉండే అఫ్రీన్ సీత కోసం చేసే ప్రయాణంలో మారిపోతుంది. పాత్రలో ఉండే ఆ ఛేంజ్ ఓవర్‌ను రష్మిక చక్కగా కనబరిచింది. ఇక సుమంత్ పోషించిన విష్ణు శర్మ పాత్ర గురించి చెప్తే ఇప్పుడు స్పాయిలర్ అవుతుంది. ఒక్క సెకనులో ఆనందం, తర్వాతి సెకనులో కోపం, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉండే పాత్రను చక్కగా పోషించారు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, భూమిక ఇలా మిగిలిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీలకు విభిన్నంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను చూడాలంటే సీతా రామంను తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సీతా రాములు అస్సలు నిరాశపరచరు.


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?