వెబ్ సిరీస్ రివ్యూ: పేపర్ రాకెట్
రేటింగ్: 3/5
నటీనటులు: కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్, కె రేణుక, కరుణాకరన్, జీఎం కుమార్, నిర్మల్ పళజి, గౌరీ జి కిషన్, నాగినీడు తదితరులు
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్, గవేమిక్ యు ఆర్య్
నేపథ్య సంగీతం: సిమన్ కె కింగ్ 
స్వరాలు : సిమన్ కె కింగ్, వేద్ శంకర్, ధరణ్ కుమార్ 
నిర్మాత: శ్రీనిధి సాగర్ 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృతిక ఉదయనిధి
విడుదల తేదీ: జూలై 29, 2022


కృతికా ఉదయనిధి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'పేపర్ రాకెట్'. తమిళంలో తీసినప్పటికీ... తెలుగులో అనువదించి విడుదల చేశారు. 'జీ 5' ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. అన్నట్టు... కృతిక ఎవరో కాదు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోడలు! హీరో ఉదయనిధి స్టాలిన్ భార్య. ట్రావెలింగ్ నేపథ్యంలో ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది?


కథ (Paper Rocket Story) : జీవా (కాళిదాస్ జయరామ్) మోడ్రన్ బాయ్. సిటీలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగి. కనీసం తండ్రి (నాగినీడు)తో ప్రశాంతంగా మాట్లాడే తీరిక కూడా ఉండదు. ఒక రోజు తండ్రి మరణించాడని ఫోన్ వస్తుంది. తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆయనతో టైమ్ స్పెండ్ చేయలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ జీవాను వెంటాడుతుంది. డిప్రెషన్‌కు లోనవుతాడు. ఒక సైక్రియాట్రిస్ట్‌ను కలుస్తాడు. గ్రూప్ సెషన్స్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ జీవాకు ఇలేఖ్య (తాన్యా రవిచంద్రన్), చారు (గౌరీ జి కిషన్), ఉన్ని (నిర్మల్ పళజీ ), వల్లీ (కె రేణుక), టైగర్ (కరుణాకరన్) పరిచయం అవుతారు. వాళ్ళ నేపథ్యం ఏమిటి? వాళ్ళందరినీ జీవా ఎందుకు టూర్‌కు తీసుకు వెళ్ళాడు? టూర్‌కు వెళ్ళిన తర్వాత ఏమైంది? అనేది మిగతా వెబ్ సిరీస్.


విశ్లేషణ (Paper Rocket Telugu Web Series Review) : ఓటీటీల్లో క్రైమ్, మాఫియా, యాక్షన్, ఎరోటిక్ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్‌లు గతంలో ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ వస్తున్నాయి. ఆ జాబితాలో 'పేపర్ రాకెట్' ఉంటుంది. టైటిల్‌కు, సిరీస్‌లో కథలకు సంబంధం లేదు. కానీ, ఆ  కథలు మన జీవితాలను ఆవిష్కరించేలా ఉన్నాయి.
 
'పేపర్ రాకెట్' వెబ్ సిరీస్‌కు బలం నటీనటులు, దర్శకత్వం! బలహీనత కథాంశం, నిడివి. తల్లిదండ్రులతో ఈతరం యువతీయువకులకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఆస్తి కోసం అన్నదమ్ములు ఎటువంటి తగాదాలకు దిగుతున్నారు? కుటుంబ సభ్యుల నుంచి లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి అంశాలను 'పేపర్ రాకెట్'లో చూపించారు.


సీరియస్ కథాంశానికి కాస్త వినోదం మేళవించి, ఉత్కంఠగా చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో దర్శకురాలు కృతిక ఉదయనిధి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. సంగీతం, ఛాయాగ్రహణం తదితర సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి అవుట్ పుట్ తీసుకున్నారు. నిడివి ఎక్కువ అయినప్పటికీ... చెప్పాలనుకున్న మంచి విషయాన్ని సూటిగా, సున్నితంగా చెప్పారు. అయితే... ఈ తరహా కథలతో చిత్రాలు రావడం వల్ల కొత్త విషయం చూసిన అనుభూతి కలగదు. కానీ, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠకు గురి చేస్తుంది. 


'పేపర్ రాకెట్'లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్‌లో జీవా నేపథ్యాన్ని, ఆ తర్వాత మిగతా వాళ్ళతో అతని పరిచయాన్ని చూపించారు. ఆ తర్వాత ఎపిసోడ్స్‌లో ఒక్కొక్కరి కథ రివీల్ చేస్తూ... వాళ్ళ సమస్యలను చూపిస్తూ చివరకు జీవించాలనే సందేశాన్ని ఇస్తారు. టూర్‌కు బయలు దేరిన టెంపోకి 'చావు బండి' అని పేరు పెడతాడు. చావు బండిలో మొదలైన జీవిత ప్రయాణమే 'పేపర్ రాకెట్' సిరీస్.


నటీనటులు ఎలా చేశారు? : ఈ వెబ్ సిరీస్‌కు పర్ఫెక్ట్ కాస్టింగ్ కుదిరింది. కాళిదాస్ జయరామ్‌ను చూస్తే మన పక్కింటి కుర్రాడిని చూసినట్టు ఉంటుంది. హ్యాండ్సమ్ లుక్స్, సెటిల్డ్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆకట్టుకుంటారు. ఇలేఖ్య పాత్రకు అవసరమైన యాటిట్యూడ్‌ను తాన్యా రవిచంద్రన్ చక్కగా చూపించారు. కాళిదాస్, తాన్యా మధ్య సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బావుంది. కరుణాకరన్, నిర్మల్, రేణుక... ప్రతి ఒక్కరూ పాత్రలకు న్యాయం చేశారు. ఉన్ని పాత్రలో నిర్మల్ నటన కొన్నిసార్లు నవ్విస్తుంది. గౌరీ జి కిషన్ కంటతడి పెట్టించారు. నాగినీడు పాత్రకు తమిళంలో డబ్బింగ్ చెప్పిన వ్యక్తితో తెలుగు డబ్బింగ్ చెప్పించడం బాలేదు. ఆయన తెలుగు స్పష్టంగా పలకలేదు. దాంతో ఆయన సన్నివేశాలకు కనెక్ట్ కావడం కష్టం. 


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'పేపర్ రాకెట్'... ఇదొక ఫీల్ గుడ్ వెబ్ సిరీస్. కాన్సెప్ట్ కాస్త రొటీన్ అయినప్పటికీ... ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా తీశారు. ఇందులో కొన్ని మైనస్‌లు ఉన్నాయి. నిడివి ఎక్కువ అయ్యింది. ఆ అంశాలను పక్కన పెడితే... ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. సున్నితమైన కథలు, సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశాలు కోరుకునే ప్రేక్షకులను 'పేపర్ రాకెట్' ఆకట్టుకుంటుంది. ఒకసారి చూడొచ్చు. 


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?