సినిమా రివ్యూ: విక్రాంత్ రోణ
రేటింగ్: 2.5/5
నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
సహ నిర్మాత: అలంకార్ పాండియన్
నిర్మాతలు: జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్
రచన, దర్శకత్వం: అనూప్ భండారి
విడుదల తేదీ: జూలై 28, 2022
కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 'ఈగ'తో మనకు దగ్గరైన ఆయన... ఆ తర్వాత 'బాహుబలి', 'సైరా' చిత్రాల్లో కనిపించారు. కన్నడ డబ్బింగ్ సినిమాలతో హీరోగానూ వచ్చారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'విక్రాంత్ రోణ' (Vikrant Rona). కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? (Vikrant Rona Movie Review)
కథ (Vikrant Rona Movie Story) : కొమరట్టు ఊరిలో పోలీస్ చనిపోతారు. ఒక ఇంటి ఆవరణలోని బావిలో బాడీ దొరుకుతుంది. కానీ, తల దొరకదు. ఆయన మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలని కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్) ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోలీస్ మాత్రమే కాదు... ఆ ఊరిలో మరికొంత మంది పిల్లలు కూడా చనిపోయారని తెలుస్తుంది. పోలీస్ బాడీ దొరికిన ఇంటిలోకి కొత్తగా దిగిన పన్నా (నీతా అశోక్) ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? పోలీస్ బాడీని ముందుగా చూసిన, చూడటానికి కొన్ని క్షణాల ముందు ఊరికి వచ్చిన సంజు (నిరూప్ భండారి) ఎవరు? ఊరిలో చిన్నారుల మరణానికి, విక్రాంత్ రోణ వ్యక్తిగత జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? చివరకు, హంతకులను విక్రాంత్ రోణ పట్టుకున్నాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Vikrant Rona Review) : 'విక్రాంత్ రోణ'... ఇదొక యాక్షన్ థ్రిల్లర్. కథగా, ఓ సినిమాగా చూస్తే రొటీన్ అనిపిస్తుంది. కానీ... దర్శకుడు రొటీన్‌గా చెప్పలేదు. కాస్త హారర్, మరికొంత అడ్వెంచర్ అంశాలు మేళవించి వెండితెరపై కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపంచం కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది.
సినిమా ప్రారంభం బావుంటుంది. ముగింపు కూడా బావుంది. కానీ, మధ్యలో సినిమా రోలర్ కోస్టర్ రైడింగ్ ఫీల్ ఇస్తుంది. నిరూప్ భండారి, నీతా అశోక్ మధ్య పాట, కొన్ని సీన్స్ నిడివి పెంచాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఎంత రిచ్‌గా ఉన్నప్పటికీ... మ్యూజిక్ బావున్నా... బోరింగ్ మూమెంట్స్ వస్తుంటాయి. అది సినిమాకు మేజర్ మైనస్.
నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకున్న దర్శకుడు అనూప్ భండారి... స్క్రీన్ ప్లే విషయంలో, కథను రేసీగా నడపడంలో ఫెయిల్ అయ్యారు. రొటీన్ కథను డిఫరెంట్‌గా చెప్పాలని స్క్రీన్ ప్లేతో కన్‌ఫ్యూజ్ చేశారు. అయితే... కథను చెప్పే విషయంలో ఆయన డిటైలింగ్‌ను మెచ్చుకోవాలి. ఆ డిటైలింగ్ వల్ల సినిమా నిడివి ఎక్కువ అయ్యింది. దాంతో నిదానంగా సాగిన ఫీలింగ్ ఉంటుంది. మేకప్, ప్రొడక్షన్ డిజైనర్స్‌ను ప్రత్యేకంగా అభినందించాలి.
సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. అజనీష్ లోక్‌నాథ్ సౌండ్ డిజైన్ సూపర్బ్. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు. మరికొన్ని సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ కలిగించారు. నేపథ్య సంగీతం చాలా బావుంది. ఇక, పాటలకు వస్తే... 'రా రా రక్కమ్మ' సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యింది. మిగతా పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. వీఎఫ్ఎక్స్ టాప్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది.
నటీనటులు ఎలా చేశారు? : కిచ్చా సుదీప్ ప్రాణం పెట్టి నటించారు. ప్రతి సీన్, ఫైట్‌లో ఆయన ఎఫర్ట్ కనబడుతుంది. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. నటనతో ఉత్కంఠ కలిగించారు. ఫైట్స్‌లో పాదరసంలా కదిలారు. డ్యాన్స్ బాగా చేశారు. సంజు పాత్రలో నిరూప్ భండారి ఓకే. పతాక సన్నివేశాల వరకూ ఆయన పాత్ర సాదాసీదాగా ఉండటంతో నటనలో పెద్దగా ప్రతిభ చూపించే అవకాశం దక్కలేదు. పతాక సన్నివేశాల్లో చిన్న సర్‌ప్రైజ్ ఇస్తారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ పాత్ర ఓ సన్నివేశం, పాటకు పరిమితం అయ్యింది. 'రా రా రక్కమ్మ' పాటలో జాక్వలిన్ హుషారైన స్టెప్పులు వేశారు. ఊరి పెద్ద పాత్రలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు మధుసూదన్ రావు కనిపిస్తారు. నీతా అశోక్ సహా మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.
Also Read : ది గ్రే మ్యాన్ రివ్యూ: ధనుష్ హాలీవుడ్ సినిమాలో యాక్షన్ ఓకే, కథ సంగతేంటి?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'విక్రాంత్ రోణ' రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే... పతాక సన్నివేశాలు చూశాక కథలో కొత్తగా ఏముంది? అనిపిస్తుంది. సుదీప్ నటన సూపర్బ్. ముందుగా చెప్పినట్టు... మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా! సో... వీకెండ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అదీ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే!
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?