సినిమా రివ్యూ: బింబిసార
రేటింగ్: 3/5
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, శ్రీనివాసరెడ్డి, కేథరిన్, సంయుక్తా మీనన్, వైవా హర్ష, వరీనా హుస్సేన్ తదితరులు
మాటలు: వాసుదేవ మునేప్పగారి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
స్వరాలు : చిరంతన్ భట్, ఎం.ఎం. కీరవాణి

  
నేపథ్య సంగీతం : ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ : నందమూరి తారక రామారావు ఆర్ట్స్ 
నిర్మాత: హరికృష్ణ .కె
రచన, దర్శకత్వం: వశిష్ఠ
విడుదల తేదీ: ఆగస్టు 5, 2022


కథానాయకుడిగా, నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ రెడీ. ఆయనలో ఆ లక్షణమే 'అతనొక్కడే', 'పటాస్' వంటి విజయాలు అందించింది. పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు 'బింబిసార' (Bimbisara Movie) తో ఆయన మరో విజయం అందుకున్నారా? విడుదలకు ముందు ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉంది? తొలిసారి రాజుగా నటించిన కళ్యాణ్ రామ్ ఎలా చేశారు? 


కథ (Bimbisara Story) : త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసార (నందమూరి కళ్యాణ్ రామ్)కు ఎదురు లేదు. శత్రువుల రక్తంతో భూమిని తడిపి... తనకు అడ్డు వచ్చిన రాజులను చంపేసి... రాజ్యాలను ఆక్రమించుకుంటూ... తన రాజ్యపు సరిహద్దులను చెరిపేస్తూ... త్రిగర్తల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళతాడు. అధికారానికి అడ్డు వస్తాడని కవల సోదరుడు దేవ దత్తుడిని చంపడానికి వెనుకాడడు. అలాంటి మద గజ మహా చక్రవర్తిలో మార్పు వస్తుంది. అందుకు కారణం ఎవరు? క్రూరత్వానికి ప్రతీక అయినటువంటి... చరిత్రలో చెరగని నెత్తుటి సంతకం చేసినటువంటి బింబిసారుడిని ఈ తరంలోని ఆయన వారసులు గొప్పగా కొలవడానికి కారణం ఏమిటి? పెళ్లి కాని, అసలు పిల్లలే లేని బింబిసారుడికి వారసులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తరంలో బింబిసారుడు దాచిన నిధి తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్యశాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అతడిని బింబిసారుడు ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Bimbisara Telugu Movie Review) : 'బింబిసార' సోషియో ఫాంటసీ ఫిల్మ్. ఇటువంటి సినిమాలో లాజిక్స్ చూడకూడదు. సిల్వర్ స్క్రీన్ మీద మేజిక్ ఎంజాయ్ చేయాలి. 'బింబిసార' విషయంలో అటువంటి మేజిక్ నందమూరి కళ్యాణ్ రామ్. వన్ మ్యాన్ షోతో ఆయన మేజిక్ చేశారు. ప్రతి ఫ్రేములో సినిమాను భుజాలపై మోశారు.
 
దర్శకుడు వశిష్ఠ రాసుకున్న కథ కొత్త కాదు. కానీ... ప్రతి పదిహేను, 20 నిమిషాలకు ట్విస్ట్ ఇచ్చారు. గతంలో ఇటువంటిది ఎక్కడో చూశామని అనుకునేలోపు కథను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఆయన్ను మెచ్చుకోవాలి. 'బింబిసార' కథపై, ముఖ్యంగా మేజర్ ట్విస్ట్ విషయంలో 'ఆదిత్య 369' ప్రభావం బలంగా కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ బాలేదు. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చూసిన కళ్ళకు కొన్ని తేడాలు స్పష్టంగా కనబడతాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రకాష్ రాజ్ సీన్స్ ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఉంటే బావుండేది. రెండు మూడు కామెడీ సీన్స్ అయితే 'యమ లీల'ను గుర్తు చేస్తాయి. అయితే... బింబిసార క్యారెక్టరైజేషన్, కళ్యాణ్ రామ్ నటన సినిమాలో లోపాలను చాలా వరకూ కవర్ చేసింది.


కీరవాణి నేపథ్య సంగీతం బావుంది. అలాగే... ఆయన, చిరంతన్ భట్ అందించిన స్వరాలు కూడా! యాక్షన్ కొరియోగ్రఫీ, స్టంట్స్ డిజైనింగ్ బావుంది. 'బింబిసార'లో యుద్ధ సన్నివేశాలు లేవు. అయితే... కళ్యాణ్ రామ్ కత్తి దూసే విజువల్స్, ఆయనను చూపించిన తీరు బావుంది. కీరవాణి నేపథ్య సంగీతం తోడు కావడంతో కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. బింబిసార పాత్రకు రాసిన సంభాషణల బావున్నాయి. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది.  


నటీనటులు ఎలా చేశారు? : కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. రెండు పాత్రల్లో బింబిసారుడిగా ఆయన నటన బావుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తు ఉంటుంది. బింబిసారగా ఆయన డైలాగ్ డెలివరీ సూపర్. సీన్, సాంగ్, ఫైట్... కొత్త కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. ఆయన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ 'బింబిసార' అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మోడ్రన్ డ్రస్ (సూట్)లో మాంచి స్టైలిష్‌గా ఉన్నారు. ఒక పాట, రెండు సన్నివేశాలకు కేథరిన్ పరిమితం అయ్యారు. 'ఓ తేనే పలుకుల...' పాటలో ఆమె లుక్ బావుంది. మరో హీరోయిన్ సంయుక్తా మీనన్ పాత్రకు కథలో ఇంపార్టెన్స్ లేదు. మోడ్రన్‌గా కనిపించారు. సోషియా ఫాంటసీ ఫిల్మ్‌లో లాజిక్స్ వదిలేయాలనుకున్నా... లేడీ పోలీస్ డ్రస్సింగ్ అలా ఉండటం అనేది అడ్జస్ట్ చేసుకోవడం కష్టమే. ఫస్ట్ సాంగ్‌లో వరీనా హుస్సేన్ అందంగా కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి, అయ్యప్ప శర్మ, తనికెళ్ళ భరణి, వివాన్ భటేనా తదితరులు పాత్రల తగ్గట్లు నటించారు. స్క్రీన్ మీద ఎంత మంది నటీనటులు ఉన్నప్పటికీ... వాళ్ళందర్నీ మర్చిపోయేలా, మైమరపించేలా కళ్యాణ్ రామ్ నటించారు. 


Also Read : పేపర్ రాకెట్ రివ్యూ: చావు బండి నుంచి బతుకు వరకూ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
 
చివరగా చెప్పేది ఏంటంటే? : 'బింబిసార' కథ కొత్తది అని చెప్పలేం. కొత్త సీన్లు ఉన్నాయని చెప్పలేం. కానీ, నటుడిగా కళ్యాణ్ రామ్‌ను కొత్తగా చూపించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీ సీన్స్ వచ్చినప్పుడు కొంత స్లో అనిపించినప్పటికీ... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? దీని తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తి కలిగించేలా దర్శకుడు వశిష్ఠ సినిమా తీశారు. చక్కటి కమర్షియల్ ప్యాకేజ్డ్ ఫాంటసీ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ఇది. కళ్యాణ్ రామ్ కోసం తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?