జీవితంలో సరిగ్గా స్థిరపడని పెళ్లీడుకొచ్చిన యువకులకు వివాహం కావడం ఈ రోజుల్లో ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ, నారాయణ పేటకు చెందిన ఈ 44 ఏళ్ల వ్యక్తి మాత్రం ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలు చెప్పి వలలో వేసుకొని వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నిందితుడి బాగోతం బయటికి వచ్చింది. మొదటి భార్యకు తొలుత ఈ విషయం తెలియడంతో పోలీసులు ఇతని లీలలపై విచారణ చేశారు.


మాయ మాటలతో నమ్మించి.. ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్న ఇతను.. ఇంటికి పెద్ద దిక్కులేని, ఏం చేసినా అడిగేవారు లేని మహిళలనే టార్గెట్ గా చేసుకున్నాడు. అలాంటివారిని లొంగదీసుకుని మాయమాటలతో పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఆ మండలానికి చెందిన అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహా రెడ్డి అనే 44 ఏళ్ల వ్యక్తి తాపీ మేస్త్రీ. మొదటిసారిగా 2009లో నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని రాంకిష్టయ్యపల్లికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు పుట్టారు. 


ఇదిలా ఉండగా, మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పటికే పెళ్లై ఒకపాప ఉన్న అప్పిరెడ్డిపల్లికి చెందిన మహిళను గుళ్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తరవాత రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలిసింది. భర్త వేధింపులు భరించలేక, అతడి వ్యవహారం నచ్చక కొన్నేళ్లుగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయి దూరంగా ఉంటోంది. 


నర్సింహా రెడ్డి అప్పుడప్పుడు పని కోసం హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో అక్కడ పనిచేస్తున్న కోయిలకొండ మండలానికి చెందిన మహిళను మూడోపెళ్లి చేసుకున్నాడు. అక్కడే కాపురం కూడా పెట్టేశాడు. భర్త ఇంటికి రావడం లేదని రెండో భార్య వెళ్లి ఆరా తీయగా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు ఆమెకు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఆమె కూడా దూరంగా ఉండడం మొదలుపెట్టింది. 


ఈ క్రమంలోనే నారాయణ పేట మండలం అప్పక్‌పల్లికి చెందిన మరో మహిళకు తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి గత నెలలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ మొదటి భార్య వద్దకు వెళ్లి వేధిస్తుండటంతో ఆమె సఖీ సెంటర్‌ను ఆశ్రయించారు. వారి ద్వారా షీ టీం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ గౌడ్‌ తెలిపారు. మరో నలుగురైదుగురు ఇతని చేతిలో మోసపోయినట్లుగా సఖీ కేంద్రం నిర్వహకుల విచారణలో వెల్లడైంది. రెండు నెలలకు ఓసారి ఎవరో ఒక మహిళను ఇంటికి తీసుకువస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సఖీ కేంద్రం నిర్వహకులు పోలీసులకు చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.