Paternity Leave in Pfizer:
పితృత్వ సెలవులు
దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌లో పని చేసే పురుషులు 12 వారాల పాటు పిత్రృత్వ సెలవులు (Paternity leaves) తీసుకోవచ్చని వెల్లడించింది. ఈ వారమే ఈ నిర్ణయం తీసుకుంది. దత్తత తీసుకున్న వారికీ ఈ సెలవులు వర్తించ నున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రెండేళ్ల కాలంలో ఈ పెటర్నిటీ లీవ్స్ తీసుకునేందుకు అవకాశ ముంటుంది. ఒకేసారి గరిష్ఠంగా నాలుగు వారాలు, కనిష్ఠంగా రెండు వారాలు సెలవులు తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అంతే కాదు. వైద్య సేవల్నీ విస్తృతం చేసింది. సంతాన లేమితో బాధ పడుతున్న వారికి వైద్యం అందించడంతో పాటు టెలీ మెడిసిన్ సౌకర్యం కూడా కల్పించింది. పురుషులు, స్త్రీలు పిల్లలతో తగినంత సమయం గడపాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణం తీసుకున్నామని ఫైజర్ డైరెక్టర్ శిల్పి సింగ్ వెల్లడించారు. "పేరెంటింగ్‌లోని ఆనందం ఏంటో తెలుసుకోవాలనే పురుషులకు ఇలా సెలవులు ఇచ్చాం. ఈ 12 వారాల లీవ్స్‌తో వాళ్లు పితృత్వాన్ని ఆస్వాదిస్తామని భావిస్తున్నాం" అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌లు తయారు చేయడంలో ఫైజర్ సంస్థ కీలక పాత్ర పోషించింది. అమెరికాలోని న్యూయార్క్ హెడ్‌క్వార్టర్స్ నుంచే ప్రధాన కార్యకలాపాలన్నీ సాగుతాయి. జర్మన్ కంపెనీ BioNTechతో కలిసి కొవిడ్ టీకాను
తయారు చేసింది ఫైజర్ సంస్థ. ప్రస్తుతానికి కొవిడ్, ఇన్‌ఫ్లుయెంజాపై ఒకేసారి పని చేసే టీకాను తయారు చేసి పరీక్షిస్తున్నారు. నిజానికి... పెటర్నటీ లీవ్స్ ఇవ్వడం ఇప్పుడు అన్ని కంపెనీల్లోనూ చూస్తున్నాం. పిల్లల సంరక్షణ బాధ్యత కేవలం తల్లులదే అనే ఆలోచనను పక్కన పెట్టి పలు దిగ్గజ సంస్థలు తప్పనిసరిగా పితృత్వ సెలవులు ఇస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వర్క్, లైఫ్ బ్యాలెన్స్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. పరాగ్ అగర్వాల్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు పేరెంటింగ్‌పై తరచూ మాట్లాడడం వల్ల దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తండ్రులు కూడా పిల్లల సంరక్షణలో పాలు పంచుకోవాలని, పూర్తిగా తల్లులపైనే భారం వేయకూడదన్న అవగాహన పెరుగుతోంది.
వ్యాక్సిన్..
అత్యధిక మ్యూటేషన్లు ఉన్న కరొనా వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఫైజర్ - బయోన్‌టెక్ వ్యాక్సిన్ రెడీ చేశాయి. ఫైజర్, బయోఎన్‌టెక్ ఇప్పటికే కోవిడ్‌కు బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తోంది. బూస్టర్ డోస్ తర్వాత నాలుగు నెలల తర్వాత ఓమిక్రాన్ వైరస్ వేరియంట్‌ను ఎదుర్కొనేలా రోగనిరోధకత ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ముందు ముందు వ్యాక్సిన్ అవసరమా లేదా అన్న విషయాన్ని బహిర్గత పరుస్తాయని అంటున్నారు. ప్రత్యేకంగా ఒమిక్రాన్ రాకుండా వ్యాక్సిన్ అయితే మళ్లీ ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సిన్లు అందలేదన్న విమర్శలు ఉన్నాయి.