Hyderabad News: 


గూగుల్‌లో వెతికి తెలుసుకున్నా...


ఆరేళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది. తోటి పిల్లలతో ఆడుకుంటాడు. అల్లరి చేస్తాడు. అమ్మ నాన్నలను విసిగిస్తాడు. ఇంతకు మించి ఏం చేయగలడు అని అనుకుంటాం. కానీ...వయసుకి, ఆలోచనలకు సంబంధం లేదని నిరూపించాడు హైదరాబాద్‌కు చెందిన ఓ చిన్నారి. "నేను ఎక్కువ కాలం బతకను. ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకండి. బాధ పడతారు" అని ఓ వైద్యుడికి చెప్పాడు. ఇది విన్న ఆ వైద్యుడి నోట మాట రాలేదు. "ఆరేళ్ల  పిల్లాడేనా ఇలా మాట్లాడేది" అని ఆశ్చర్యపోయాడు. ఆ చిన్నారికి క్యాన్సర్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆ డాక్టర్‌తో చెప్పాడు. "నేను ఆరు నెలల కన్నా ఎక్కువ బతకను. నాకున్న లక్షణాలను బట్టి ఇది క్యాన్సర్ అని గూగుల్‌లో వెతికి తెలుసుకున్నా. ఈ విషయం అమ్మనాన్నలకు తెలియదు. మీరూ చెప్పకండి. నా చివరి రోజుల్లో వాళ్లు ఆనందంగా చూడాలని కోరుకుంటున్నా" అని ఆ వైద్యుడికి చెప్పాడు ఆ ఆరేళ్ల చిన్నారి. క్యాన్సర్ మహమ్మారి ఆ బాలుడిని బలి తీసుకున్నాక కానీ...ఆ వైద్యుడు ఎవరికీ చెప్పలేదు. ఆ చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోడం కోసం ఆ బాధను అలా గుండెల్లోనే దాచుకున్నాడు. ఆ చిన్నారి మరణించాక...ట్విటర్‌లో ఈ కన్నీటి కథను పోస్ట్ చేశారు. వరుస ట్వీట్‌లతో అసలు విషయం అంతా చెప్పారు. ఆయనె చెప్పిన వివరాల ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన దంపతులకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. వయసు ఆరేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లి టెస్ట్‌లు చేయించారు. అప్పుడే ఆ బాబుకి క్యాన్సర్‌ ఉందని తేలింది. ఇది విని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఏం జబ్బు వచ్చిందో ఆ చిన్నారికి తెలయనీయకుండా జాగ్రత్తపడ్డారు. మందులు వాడారు. కానీ...ఆ చిన్నారి మాత్రం తనకు ఇస్తున్న మెడిసిన్ ఏంటో గూగుల్‌లో వెతికాడు. తనకు క్యాన్సర్ ఉందని అర్థం చేసుకున్నాడు. 














అమ్మనాన్నలకు చెప్పకండి..


ఆ తరవాత తరచూ ఫిట్స్ వస్తుండటం వల్ల హైదరాబాద్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌బాబు వద్దకు తీసుకెళ్లారు. విషయంతా చెప్పారు. చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని వైద్యుడు తెలిపాడు.  అప్పుడే ఉన్నట్టుండి ఆ చిన్నారి తల్లిదండ్రులను బయటకు వెళ్లమని చెప్పాడు. డాక్టర్‌తో పర్సనల్‌గా మాట్లాడాడు. "డాక్టర్..నాకు క్యాన్సర్ వచ్చింది కదా. నేను గూగుల్‌లో చూసి తెలుసుకున్నాను. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు ఎక్కువ రోజులు బతకరు అని తెలుసు. నాకు తెలుసన్న విషయం అమ్మనాన్నలకు తెలియదు. మీరూ  ఈ విషయం వాళ్లకు చెప్పొద్దు" అని వేడుకున్నాడు. ఆ తరవాత ఆ వైద్యుడు చిన్నారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాడు. "క్యాన్సర్ వచ్చిందని మీ బాబుకి తెలుసు. ఈ చివరి రోజుల్లో తను హ్యాపీగా ఉండాలంటే...మీకు ఈ విషయం తెలియనట్టే ఉండండి" అని సూచించాడు. ఇది విని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు ఆ తల్లిదండ్రులు. చిన్నారి గొప్ప మనసుని అర్థం చేసుకుని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించారు. రకరకలా వంటకాలు చేసి పెట్టారు. ప్రదేశాలు తిప్పారు. అమెరికాకు తీసుకెళ్లి తనకు ఇష్టమైన ప్రతి చోటుకీ తీసుకెళ్లారు. "ఈ ఆనందం అంతా తాత్కాలికమే" అని తెలిసినా ఆ బాధను దిగమింగుకుని కాలం గడిపారు. 8 నెలలు గడిచాక...ఆ చిన్నారి ఈ లోకం వదిలి వెళ్లిపోయాడు. ఆ తరవాత  ఆ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్‌ సుధీర్‌బాబుని కలిసి విషయం చెప్పారు. ఇది విని ఎమోషనల్ అయిన డాక్టర్ భావోద్వేగాన్ని ఆపుకోలేక ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చదివిన నెటిజన్లు "ఇంత చిన్న వాడికి ఎంత గొప్ప ఆలోచన" అని కామెంట్ చేస్తున్నారు. 


Also Read: New Corona Variant: తెలంగాణలో తొలి ‘XBB.1.5 వేరియంట్’ కరోనా కేసు గుర్తింపు, ఇది ఎంత డేంజర్?