కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెందుతూ ఇంకా మానవాళిని కంగారు పెడుతూనే ఉంది. డెల్టా వేరియంట్, ఓమిక్రాన్‌తో తీవ్రమైన ప్రభావం చూపిన వైరస్ ఇప్పుడు ఓమిక్రాన్‌లో ఇంకో సబ్ వేరియంట్ గా రూపాంతరం చెంది ఎక్స్‌బీబీ.1.5 గా మారింది. ఇది ఇప్పుడు అమెరికాను వణికిస్తుంది. ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ కేసులు కొత్తగా తెలంగాణలో వెలుగు చూడడం కలవరం పుట్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి ఈ వేరియంట్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన XBB.1.5 వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ విషయాన్ని గురువారం (జనవరి 6) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నియమించిన ఇన్సాకాగ్‌ (INSACOG) వెల్లడించింది.


దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఈ తరహా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇంతకు ముందు ఎక్స్‌బీబీ.1.5 కేసులు గుజరాత్‌లో మూడు, కర్ణాటకలో ఒకటి, రాజస్థాన్ లో ఒకటి చెప్పున గుర్తించారు. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం దీనికి ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువ అని అంటున్నారు.


ఎక్స్‌బీబీ.1.5 అనే సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియంట్‌ రకానికి చెందినది. అమెరికాలో కొవిడ్‌ కేసుల పెరుగుదల ఈ వేరియంట్ వల్లే జరుగుతోంది. అలాగే మనదేశంలో బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు కూడా మొత్తం ఏడు గుర్తించినట్లుగా ఇన్సాకాగ్‌ రిపోర్టు తెలిపింది. ఈ రకం వేరియంట్‌ వల్లే చైనాలో కరోనా కేసులు బాగా నమోదవుతున్నాయి.